
బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో అటవీశాఖ నిషేధిత వాటర్ ఫాల్స్ కొంగల జలపాతం వద్ద ఈ సంఘటన జరిగింది. అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి వెళ్లిన సందర్శకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడు జలపాతం కుంటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి, అదే నీళ్లలో మునిగిపోయిన మరో ముగ్గురిని ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీశాఖ అధికారులు, గజఈతగాళ్లు డెడ్ బాడీని బయటకు తీశారు.
ములుగు జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ వేల విషాదం చోటు చేసుకుంది..సెల్ఫీ కోసం చేసిన రిస్క్ ఓ యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. ఈ ప్రమాదం వాజేడు మండలంలోని కొంగాల జలపాతం వద్ద జరిగింది. హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు.. ములుగు జిల్లాలోని జలపాతాల సందర్శనకు వచ్చారు. అటవీశాఖ అధికారుల నిషేధ ఆజ్ఞలు ఉన్న కొంగాల జలపాతం సందర్శనకు వెళ్లారు. అటవీశాఖ సిబ్బంది కళ్ళుకప్పి స్థానికుల సహాయంతో కొంగల జలపాతం వద్దకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంతలోనే వారిని మృత్యువు వెంటాడింది. నీళ్ళలో సెల్ఫీ కోసం చేసిన రిస్క్ ఓ యువకుడి ప్రాణాలు మింగేసింది. మహాస్విన్ అనే యువకుడు ఆ నీళ్లలో జారి పడి గల్లంతయ్యాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి ఓ మహిళ తోపాటు అభిరామ్, హర్ష అనే మరో ముగ్గురు కూడా అదే నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో వారిని గమనించిన అర్జున్ అనే యువకుడు తన ప్రాణాలకు తెగించాడు. ముగ్గురి ప్రాణాలు కాపాడాడు కానీ మహాస్విన్ అనే యువకుడు మాత్రం నీటిలో గల్లంతయ్యాడు.
వీడియో చూడండి..
యువకుడు గల్లంతైన విషయం స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు చేపట్టి మహాస్విన్ మృతదేహాన్ని వెలికి తీశారు. అక్కడి నుండి పోస్టుమార్టం కోసం వెంకటాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేకున్నా అటవీశాఖ సిబ్బంది కంటపడకుండా ఉదయాన్నే జలపాతం వద్దకు వెళ్ళారు. ఇలాంటి జలపాతాల వద్ద ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులు పోలీసులు నిబంధనలు అతిక్రమించి వెళ్తే వారి పైన కఠినచర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..