Vaibhav Suryavanshi vs Ayush Mhatre: భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాలో అండర్-19 జట్టు తరపున ఆడుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే, వీరిద్దరిలో ముందుగా భారత సీనియర్ జట్టులో ఎవరికి అవకాశం లభిస్తుంది అనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఈ ప్రశ్నకు భారత మాజీ క్రికెటర్, తన కెరీర్లో 61 మ్యాచ్‌లు ఆడిన అంబటి రాయుడు ఒక పోడ్కాస్ట్లో సమాధానం ఇచ్చి, ఈ చర్చకు ముగింపు పలికారు.
ఈ ఏడాది ఆగస్టులో అంబటి రాయుడుతో జరిగిన ఒక పోడ్కాస్ట్లో.. శుభాంకర్ మిశ్రా అడిగిన ప్రశ్నకు రాయుడు స్పందించారు. “వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే.. ఈ ఇద్దరిలో మీరు టీమిండియాలోకి ముందుగా ఎవరిని చూడబోతున్నారు?” అని అడిగినప్పుడు, రాయుడు ఏ మాత్రం ఆలోచించకుండా వైభవ్ సూర్యవంశీ పేరును సూచించారు. ఆయుష్ కంటే వైభవ్ పేరును చెప్పడానికి గల కారణాన్ని కూడా ఆయన వివరించారు.
అంబటి రాయుడు మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ ఇంత చిన్న వయసులో ఆడుతున్న తీరు, అతని ఆటలోని పరిణతి చూస్తుంటే, అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడని నాకు అనిపిస్తోందని అన్నారు. వైభవ్ బ్యాట్ స్వింగ్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. అతని బ్యాటింగ్‌ను దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారాతో పోల్చారు. అలాగే, వైభవ్‌కి ఒక ముఖ్యమైన సలహా కూడా ఇచ్చారు. ఎక్కువ మంది సలహాలు వినకుండా, కేవలం తన ఆటపై దృష్టి పెట్టమని సూచించారు. ప్రజలు కూడా అతనికి ఎక్కువ జ్ఞానం ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.
వైభవ్ సూర్యవంశీ ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటివరకు 8 అండర్-19 వన్డేలు ఆడి 54 సగటుతో 432 పరుగులు చేశాడు, ఇందులో 143 పరుగుల ఒక భారీ ఇన్నింగ్స్ కూడా ఉంది. అండర్-19 టెస్ట్‌లలో 4 ఇన్నింగ్స్‌లలో 198 పరుగులు చేశాడు, అలాగే అండర్-19 టీ20లలో అతని స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. మరోవైపు, ఆయుష్ మాత్రే 8 అండర్-19 వన్డేలలో కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, టెస్ట్‌లలో 2 ఇన్నింగ్స్‌లలో 85 సగటుతో 340 పరుగులు చేసి తన సామర్థ్యాన్ని చాటాడు. ఈ రికార్డులను బట్టి చూస్తే వన్డే ఫార్మాట్లో వైభవ్ పైచేయి సాధించగా, టెస్ట్ ఫార్మాట్లో ఆయుష్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.
అండర్-19 క్రికెట్లో వైభవ్, ఆయుష్ ఇద్దరూ అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నారు. అంబటి రాయుడు చెప్పినట్లు, వైభవ్ బ్యాటింగ్ స్టైల్, కెపాసిటీ అతనికి ముందుగా అవకాశాన్ని తెచ్చిపెట్టవచ్చు. అయితే, భవిష్యత్తులో వీరిద్దరూ భారత క్రికెట్‌కు గొప్ప ఆస్తిగా మారతారని మాత్రం చెప్పవచ్చు. రాయుడు అంచనాలు నిజం అవుతాయా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..