ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే విజయనగరం జిల్లాలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం రామనారాయణం ప్రాంగణంలో శంఖారావం లీగల్ కాంక్లేవ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ మాధవీదేవి, జస్టిస్ లక్ష్మణరావు, రిటైర్డ్ జస్టిస్ యతిరాజులు కలిసి ప్రారంభించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైన ఈ లీగల్ కాంక్లేవ్ కు సీనియర్ న్యాయవాదులు, న్యాయశాస్త్ర విద్యార్థులు, న్యాయవిశ్లేషకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రధానంగా రామాయణంలోని న్యాయ సూత్రాలు, ప్రస్తుత న్యాయశాస్త్రం మధ్య ఉన్న అనుసంధానంపై చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా వక్తలు తమ ప్రసంగాలలో రామాయణం కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథమే కాకుండా, న్యాయం, ధర్మం, సమాజ పరిపాలనకు మార్గదర్శక గ్రంథమని గుర్తుచేశారు.
రాముని పాలనలో పాటించిన సూత్రాలు నేటి రాజ్యాంగ, న్యాయవ్యవస్థలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని స్పష్టం చేశారు.ముఖ్యంగా సత్యనిష్ఠ, సమానత్వం, ధర్మం ముందు అందరూ సమానమే అన్న సూత్రం నేటి న్యాయ వ్యవస్థలో కూడా ప్రతిధ్వనిస్తుందని వివరించారు. న్యాయమూర్తులు తమ ప్రసంగంలో యువతకు, ముఖ్యంగా లా విద్యార్థులకు, భారతీయ మత గ్రంథాలలోని విలువలను అధ్యయనం చేయాలని సూచించారు. చట్టం కేవలం కోర్టులో వాదనలకు మాత్రమే పరిమితం కాకుండా, సామాజిక న్యాయం సాధనకు ఉపయోగపడే సాధనమని గుర్తుచేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు నిర్వాహకులను ప్రశంసించారు.
మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాదులు కూడా రామాయణంలో సీతా అపహరణ, వనవాసం, రాముని ధర్మపాలన వంటి సంఘటనలను ఉదాహరణలుగా తీసుకుని, వాటిని ఆధునిక న్యాయశాస్త్రంతో పోల్చి వివరించారు. ఈ లీగల్ కాంక్లేవ్ లో పాల్గొన్న న్యాయవాదులు, విద్యార్థులు చర్చలతోపాటు అనేక ప్రశ్నలు అడగగా, న్యాయమూర్తులు, వక్తలు వారికి విస్తృతంగా సమాధానాలు ఇచ్చారు.
ఇటువంటి కార్యక్రమాలు న్యాయ విద్యార్థులకు, నూతన తరానికి చట్టం పట్ల అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు నారాయణం నాగేశ్వరరావు కుటుంబసభ్యులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో న్యాయ చర్చలు జరిగి, ధర్మం న్యాయం మధ్య సంబంధంపై లోతైన విశ్లేషణలు వెలువడటంతో ఈ కాంక్లేవ్ ఒక ప్రత్యేకతను చాటుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.