
రంగస్థలం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ధర్మవరపు సుబ్రమణ్యం. వందలాది సినిమాల్లో నటించిన ఆయన తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఓ వైపు వెండితెరపై మెరుస్తూనే బుల్లితెరపైనా అదరగొట్టారు. తన నటనా ప్రతిభకు ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారీ స్టార్ కమెడియన్. అలాగే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు ధర్మవరపు సుబ్రమణ్యం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు టాప్ కమెడియన్ కొనసాగిన ఆయన 2013లో లివర్ క్యాన్సర్ తో కన్నుమూశారు. అంటే ఈ స్టార్ కమెడియన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సుమారు 12 సంవత్సరాలు అవుతోంది. అయితే ఇన్నేళ్లయినా ధర్మవరపు సుబ్రమణ్యం ఆఖరి కోరిక మాత్రం నెరవేరలేదట. కాగా చివరి రోజుల్లో ధర్మవరపు సుబ్రమణ్యం ఎంతో మానసిక వేధన అనుభవించారట. తనను చూడడానికి ఎవరూ ఇండస్ట్రీ వాళ్లను కూడా రమ్మనలేకపోయారట. ఈ విషయాన్ని ధర్మవరపు సుబ్రమణ్యం సతీమణి కృష్ణజ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అలాగే ఆయన ఇష్టాయిష్టాలను, ఆఖరి కోరికను కూడా ఆమె బయట పెట్టారు.
‘ ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు మా ఆయన చిన్నపిల్లాడిలా ఏడ్చేవారు. తన పరిస్థితి ఇలా అయ్యిందేంటని మానసిక క్షోభ అనుభవించారు. ఆయనను చూసి మా గుండె తరుక్కుపోయేది. మా వారికి తన మనవళ్లను చూడాలనే కోరిక చాలా ఉండేది. కానీ దురదృష్టవశాత్తూ ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. అలాగే తాను లేకపోయినా సినిమా ఇండస్ట్రీలో తన పేరును నిలబెట్టాలని రెండవ అబ్బాయి తేజ దగ్గర మాట తీసుకున్నారు. పెద్దబ్బాయి సందీప్ వ్యాపార రంగంలో సెటిల్ అయ్యాడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం రెండవ అబ్బాయి రవి బ్రహ్మ తేజ కూడా ఉద్యోగం చేసి మానేసి తండ్రి బాటలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ నా బిడ్డకు అనుకున్నంత స్థాయిలో ఇంకా అవకాశాలు రాలేదు. నా భర్త లాగే నా కొడుకు తేజ కూడా మంచి కమెడియన్ లా పేరు తెచ్చుకోవాలని మేము కలలు కంటున్నాం’ అంటూ ఓ సందర్భంలో ఎమోషనలైంది ధర్మవరపు సుబ్రమణ్యం భార్య.
ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ధర్మవరపు ఆఖరి కోరిక నెరవేరలేదని అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. దర్శక నిర్మాతలు గొప్ప మనసుతో ధర్మవరపు కుమారుడికి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా రవి బ్రహ్మ తేజ సినిమాలు చేయాలని, తద్వారా ధర్మవరపు ఆఖరి కోరిన నెరవేరాలని మనమూ కోరుకుందాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.