ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా అమాయకులను మోసం చేస్తున్న భారీ సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కూలదోసారు. పక్కా ప్రణాళికతో.. ప్రాణాలకు తెగించి చేసిన ఆపరేషన్‌లో 14 రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించి 61 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నేరాలకు ఉపయోగించిన వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మొబైల్ ఫోన్లు, చెక్‌బుక్స్, ఏటీఎం కార్డులు ఉన్నాయి. ఈ ఆపరేషన్ ద్వారా సైబర్ పోలీసులు.. బాధితులకు కొత్త హోప్ ఇచ్చారు.
ఈ గ్యాంగ్ ప్రధానంగా ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ ద్వారా ఆకర్షించే ప్రకటనలు చేసి బాధితులను ఉచ్చులోకి దింపుతున్నారు. మొదట చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించి, ఆపై పెద్ద మొత్తంలో డబ్బు పెట్టించేలా ప్రలోభపెడుతున్నారు. అంతలోనే సైట్ లేదా యాప్‌ను మూసివేసి పారిపోతున్నారు. ఈ గ్యాంగ్ నుంచి ఇప్పటికే వసూలైన మొత్తాన్ని తిరిగి అందజేయడానికి పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా బాధితుల ఖాతాల్లోకి 1.01 కోట్లు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఇప్పటివరకు సైబర్ మోసాల కేసుల్లో తిరిగి ఇచ్చిన డబ్బులో భారీ మొత్తం కావడం గమనార్హం.
ఈ సందర్భంగా సైబర్ పోలీసు అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. అధిక లాభాలు వస్తాయని చెప్పి ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లకు ఆకర్షితులవ్వకూడదని సూచించారు. తెలియని లింక్స్, యాప్స్‌లో డబ్బు పెట్టడం మోసపోవడానికి దారితీస్తుందన్నారు. ఎలాంటి సందేహాలు ఉంటే సైబర్ హెల్ప్‌లైన్ 1930 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాల రూపం కూడా మారుతోందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఈ ఆపరేషన్‌తో మరోసారి తన శక్తిని నిరూపించుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..