భారతీయులకు బంగారం అంటే ప్రత్యేక సెంటిమెంట్. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ధరలు అంతకంతకూ పెరుగుతూ ప్రజలకు షాకిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం రూ.80వేల వద్ద ఉన్న తులం బంగారం ధర ఇప్పుడు రూ.లక్ష దాటింది. ఈ క్రమంలో గ్లోబల్ ఈక్విటీ స్ట్రాటజీ హెడ్ క్రిస్ వుడ్ తన దీర్ఘకాలిక బంగారం ధర అంచనాను పెంచారు. సమీప భవిష్యత్తులో అమెరికాలో బంగారం ధర ఔన్సుకు 6,600 డాలర్లు దాటే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇది భారతీయ మార్కెట్‌పై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, తులం బంగారం ధర రూ. 2 లక్షలు దాటే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఔన్సు బంగారం అంటే సమారు 31.1 గ్రాములకు సమానం.
క్రిస్ వుడ్ అంచనాల వెనుక కారణాలు
జెఫరీస్‌కు చెందిన క్రిస్ వుడ్ తన గ్రీడ్ అండ్ ఫియర్ నివేదికలో ఈ అంచనాలను వెల్లడించారు. అమెరికాలో పెరుగుతున్న తలసరి ఆదాయం, అలాగే చారిత్రక ప్రమాణాల ఆధారంగా ఈ అంచనాను రూపొందించారు. 1980లో బుల్ మార్కెంట్ గరిష్ఠ స్థాయిలో ఉన్న సమయంలో బంగారం అత్యధికంగా 850 డాలర్లు పలికింది. అమెరికా ప్రజల ఆదాయం పెరిగిన దాని ఆధారంగా బంగారం ధర కూడా పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. అంటే బంగారం ధర ఔన్సుకు 3,437 డాలర్లకు చేరుకుంటుందని ఆయన అప్పట్లో అంచనా వేశారు. అయితే ఈ లక్ష్యం ఇటీవలనే దాటింది.
కాలానుగుణంగా ఈ లక్ష్యం పెరుగుతూ వస్తోంది. మార్చి 2016లో 4,200 డాలర్లుగా అంచనా వేస్తే.. ఆగస్టు 2020లో 5,500 డాలర్లుగా అంచనా వేశారు. 1980ల బుల్ మార్కెట్‌లాగే బంగారం మరోసారి అమెరికా తలసరి ఆదాయంలో 9.9శాతం వాటాను సూచిస్తే.. బంగారం ధర ఔన్సుకు 6,571 డాలర్లకి చేరుకుంటుందని వుడ్ నమ్ముతున్నారు. ఈ కారణంగానే ఆయన కొత్త లక్ష్యాన్ని దాదాపు 6,600 డాలర్లుగా నిర్ధారించారు.
భారతీయ మార్కెట్‌పై ప్రభావం
ప్రస్తుతం అమెరికాలో ఔన్స్ బంగారం ధర 3,600 వద్ద ఉంది. దేశంలో 10 గ్రాముల ధర రూ.1,12,000 వద్ద ఉంది. అమెరికాలో బంగారం ధరలు ఔన్సుకు 6,600 డాలర్లకు చేరుకుంటే.. ఆ ప్రభావం భారతీయ మార్కెట్‌పైనా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ బంగారం ధరలు రూ. 2 లక్షలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఫెడరల్ రిజర్వ్ పాలసీ ప్రకటనకు ముందు ఈ వారం బంగారం ధర ఔన్సుకు 3,700 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవడం గమనార్హం. బంగారంపై క్రిస్ వుడ్ అంచనాలు ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచుతున్నాయి.
బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..