
కడెం మండలం లింగాపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో నర్సాపూర్ కాలనీ పంచాయతీకి చెందిన 16 మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పొదుపు డబ్బులను గత కొంతకాలం జమ చేసుకుంటున్నారు. బ్యాంకు ద్వారా వచ్చిన రుణాలను తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. అయితే ఆరు నెలలకు పైగా సంఘాల మహిళలు తమ ఖాతాల్లో పొదుపు డబ్బు ఎంత జమ అయిందో చూసుకోలేదు. ఇటీవల ఒక సంఘం సభ్యురాలు అవసరం పడి గ్రూపు ఖాతా డబ్బుల వివరాలు ఆరా తీయగా.. ఆ ఖాతాలో డబ్బు కనిపించలేదు. ఈ విషయం తెలిసుకున్న మరో మూడు గ్రూపుల సభ్యులు బ్యాంకుకు పరుగులు తీశారు. తమ ఖాతా వివరాలు ఆరా తీశారు. సేమ్ టూసేమ్ ఆ నాలుగు గ్రూపుల సభ్యుల ఖాతాల్లోనూ డబ్బులు జమ కాలేదు.మహిళా గ్రూపుల ఖాతాల్లో జమ కావాల్సిన దాదాపు రూ.4.60 లక్షలను ఓ బదిలీ ఉద్యోగి తన సొంతానికి వాడుకున్నట్టు తేలింది. విషయం బయటకు పొక్కడంతో బ్యాంక్ పరువు పోకూడదని బ్యాంక్ మేనేజర్ ఆగమేఘాల మీద మహిళల ఖాతాల్లో ఆ డబ్బులను జమచేశారు. ఈ విషయం తెలియడంతో మహిళా సభ్యులు బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంకులో డబ్బుకు రక్షణ లేదని తమ ఖాతాల్లోని పొదుపు డబ్బును ఇచ్చేయాలని పట్టుబట్టి మొత్తం డబ్బును విత్ డ్రా చేసుకుని వెళ్లారు మహిళా గ్రూప్ సభ్యులు. మేనేజర్ మధు వివరణ ఇచ్చేందుకు ససేమీరా అన్నారు. టెక్నికల్ ఇష్యూ కారణంగానే డబ్బులు జమ కాలేదని.. ప్రస్తుతం వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశామని తెలిపారు. సిబ్బంది నిర్వాకంపై మాత్రం మేనేజర్ నోరు మెదపలేదు. ఓ వైపు చెన్నూర్ గోల్డ్ లోన్ గోల్‌మాల్‌లో విచారణ సాగుతుండగానే మరోసారి ఎస్బీఐపై నమ్మకం పోయేలా ఈ ఘటన వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.