Headlines

రణరంగంగా మారిన ఏపీ పంచాయతీ పోరు.. పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల పరస్పర దాడులు


ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియగా, నేడు జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ఇరువర్గాల మధ్య తోపులాటలు, పరస్పర దాడుల ఘటనలతో గ్రామాల్లో తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది.

కాకినాడలో బీజేపీ వర్సెస్ టీడీపీ

కాకినాడ జిల్లా గోకవరంలో టీడీపీ, బీజేపీ వర్గాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. బస్టాండ్ సమీపంలోని టీడీపీ ఆఫీసు దగ్గరకు బీజేపీ నేతలు రావద్దనడంతో మొదలైన వివాదం, జ్యోతుల మరియు కంబాల వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారితీసింది. 5, 6 వార్డుల పోలింగ్ కేంద్రాలు, జూనియర్ కాలేజీ వద్ద కూడా ఇరువర్గాలు తలపడటంతో పాటు తనపై టీడీపీ వర్గీయులు దాడి చేశారని కంబాల శ్రీనివాస్ ఆరోపించారు. నార్త్ జోన్ డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

తిరుపతిలో టీడీపీ వర్సెస్ వైసీపీ

ఇటు తిరుపతి జిల్లా సి.రామాపురంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పర దాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఇరువర్గాల మధ్య గొడవ ముదరడంతో పోలింగ్ కేంద్రం దగ్గర ఓటింగ్ ప్రక్రియ కొద్దిసేపు నిలిచిపోయివడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు.

నంద్యాలలో పదవుల కోసం కొట్లాట

అటు నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ముత్తులూరులో ఉప సర్పంచ్ పదవి కోసం టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగగా, ఈ క్రమంలో వెంకటస్వామి అనే వ్యక్తిపై ప్రత్యర్థులు గొడ్డలితో దాడి చేశారు. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *