హైదరాబాద్/నాగ్‌పూర్: తెలంగాణ ఈగల్ ఫోర్స్ అందించిన కీలక నిఘా సమాచారంతో మహారాష్ట్రలో భారీ డ్రగ్స్ పట్టుబడ్డాయి. నాగ్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు రూ.1.75 కోట్ల విలువైన 1.47 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నాగ్‌పూర్‌లోని సక్కర్దారా, మహల్ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 820 గ్రాముల మెఫెడ్రోన్ (MD), 650 గ్రాముల క్రిస్టలైన్ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నాయి. నిందితులు డ్రగ్స్‌ను చిన్న చిన్న పరిమాణాల్లో ప్యాక్ చేసి విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్కో ప్యాకెట్‌ను సుమారు 2 గ్రాముల బాల్‌గా తయారు చేసి రూ.3,500 చొప్పున విక్రయించాలని భావించినట్లు సమాచారం.
నిందితుల నుంచి రూ.1,40,150 నగదు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇండోర్‌కు చెందిన జితు, రాజస్థాన్‌కు చెందిన సంజయ్ విశ్వకర్మ అలియాస్ అక్కీ భాయ్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తు మధ్యప్రదేశ్‌లోని దేవాస్ వరకు విస్తరించింది. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు, కొనుగోలుదారులు, ఇతర లింకులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ అందించిన నిఘా సమాచారం, మహారాష్ట్ర పోలీసుల అంతర్రాష్ట్ర సమన్వయం ఈ ఆపరేషన్‌లో కీలకంగా మారాయి. డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..