
చట్టపరమైన వ్యవహారాలు తలెత్తినప్పుడు మనలో చాలామంది లాయర్, అడ్వకేట్ అనే పదాలను ఒకేలా భావిస్తుంటారు. నల్లకోటు కనిపిస్తే చాలు.. లాయర్ అనో, అడ్వకేట్ అనో పిలిచేస్తాం. నిజానికి ఇద్దరూ న్యాయవిద్య అభ్యసించిన వారే అయినా, చట్టం ముందు వీరి హోదా, బాధ్యతలు వేర్వేరుగా ఉంటాయి. ఒకరికి న్యాయస్థానంలో వాదించే అవకాశం ఉంటే, మరొకరి పరిధి వేరేలా ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డిగ్రీ అందుకున్న ప్రతి ఒక్కరినీ లాయర్ అని సంబోధిస్తారు. వీరు చట్టాలపై పట్టు కలిగి ఉంటూ.. న్యాయపరమైన నోటీసులు రూపొందించడం, వివిధ ఒప్పందాల పత్రాలు రాయడం వంటి పనులు చేస్తారు. సంస్థలు లేదా వ్యక్తులకు అవసరమైనప్పుడు లీగల్ గైడెన్స్, సలహాలు అందిస్తారు. అయితే కేవలం లా డిగ్రీ ఉన్నంత మాత్రాన బార్ కౌన్సిల్ అనుమతి లేకుండా కోర్టులో నిలబడి వాదనలు వినిపించే హక్కు వీరికి ఉండదు.
అడ్వకేట్‌గా మారాలంటే ఏం చేయాలి?
లా డిగ్రీ చేతికొచ్చిన తర్వాత కోర్టులో ప్రాక్టీస్ చేసేందుకు అధికారిక గుర్తింపు పొందిన లాయర్‌ను అడ్వకేట్ అంటారు. దీనికోసం కొన్ని దశలు దాటాల్సి ఉంటుంది.
- ముందుగా రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి.
- ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పరీక్షలో పాస్ అవ్వాలి.
- ఈ అర్హత సాధిస్తేనే కోర్టులో క్లయింట్ తరఫున వాదించే లైసెన్స్ లభిస్తుంది. అందువల్లే “ప్రతి అడ్వకేట్ ఒక లాయరే.. కానీ ప్రతి లాయర్ అడ్వకేట్ కాలేడు” అనే మాట వినిపిస్తుంది.
లా చదువుకునే మార్గాలివే
న్యాయశాస్త్రం చదవాలనుకునే వారికి రెండు ప్రధాన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ తర్వాత ఎంట్రన్స్ ద్వారా నేరుగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో చేరవచ్చు. లేదా ఏదైనా డిగ్రీ పూర్తయ్యాక మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు చేయవచ్చు. కార్పొరేట్ ఆఫీసుల్లో లీగల్ సలహాదారులుగా పనిచేయాలనుకునేవారు లాయర్‌గా నిలదొక్కుకోవచ్చు. అదే కోర్టులో వాదనలు వినిపించాలనుకుంటే మాత్రం బార్ కౌన్సిల్ పరీక్ష రాసి అడ్వకేట్‌గా మారాల్సిందే.