Headlines

తెలంగాణలో కొలువైన సింధూర గణపతి.. ఈ వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట!


Sindhura Ganapathi Temple: అడిగినంతనే అనుగ్రహించే దేవుడిగా.. విఘ్నాలను తొలగించే విఘ్నరాజుగా వినాయకుడిని భక్తులు ఆరాధిస్తారు. ఏదైనా శుభకార్యం ప్రారంభించాలన్నా, కొత్త పనికి శ్రీకారం చుట్టాలన్నా ముందుగా గణపతిని పూజించడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. అయితే వినాయకుడిని కేవలం విఘ్నాలు తొలగించే దేవుడిగానే కాకుండా, మనసులోని కోరికలను నెరవేర్చే దైవంగా కూడా భక్తులు విశ్వసిస్తారు. ‘కలౌ కపి వినాయకః’ అనే నానుడి ప్రకారం కలియుగంలో హనుమంతుడు, వినాయకుడు త్వరగా అనుగ్రహించే దేవతలుగా చెబుతారు.

గణేశ పురాణం ప్రకారం.. తీరని కోరికలు నెరవేరాలని కోరుకునే వారు గణపతిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. వినాయకుడు అనేక రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాడు. వాటిలో సింధూర గణపతి రూపం ఎంతో ప్రత్యేకమైనది. ఈ రూపంలో స్వామివారిని పూజిస్తే కోరికలు త్వరగా నెరవేరడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

తెలంగాణలో కొలువైన సింధూర గణపతి

సింధూర గణపతిని దర్శించుకోవాలనుకునే భక్తులు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు వెళ్లాల్సిందే. జహీరాబాద్ పట్టణానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేజింతల్ గ్రామంలో ఈ ప్రసిద్ధ వినాయకుడు కొలువుదీరాడు. అందుకే ఈ స్వామివారిని రేజింతల్ సిద్ధి వినాయకుడిగా పిలుస్తారు. ఇక్కడి వినాయకుడి విగ్రహం ఇతర ఆలయాల్లో కనిపించే గణపతి విగ్రహాలకు భిన్నంగా ఉంటుంది. స్వామివారు దక్షిణాభిముఖంగా కొలువుదీరి, ఒళ్లంతా సింధూరం పూతతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ప్రత్యేక రూపమే ఆలయానికి మరింత విశిష్టతను తీసుకొచ్చింది. ఈ వినాయకుడికి దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర ఉందని స్థానికులు చెబుతారు.

ఇవి కూడా చదవండి



ఏటా పెరుగుతున్న వినాయకుడి విగ్రహం!

రేజింతల్ సిద్ధి వినాయకుడి ఆలయంలో మరో ఆసక్తికరమైన విశేషం ఉంది. ఇక్కడి గణపతి విగ్రహం ప్రతి సంవత్సరం కొద్దికొద్దిగా పెరుగుతూ ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ కారణంగా స్వామివారిని దర్శించుకోవడానికి స్థానిక ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా తమ కోరికలు నెరవేరాలని, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని భక్తులు ఈ సింధూర గణపతిని ప్రత్యేకంగా పూజిస్తారు.

వినాయక చవితి వంటి పర్వదినాల్లో ఆలయానికి భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది. విఘ్నాలను తొలగించి, కోరిన కోర్కెలు తీర్చే సిద్ధి వినాయకుడిగా రేజింతల్ గణపతి భక్తుల విశ్వాసాన్ని అందుకుంటున్నాడు.

(Disclaimer: ఈ కథనంలోని వివరాలు పురాణాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, స్థానికంగా ప్రచారంలో ఉన్న నమ్మకాల ఆధారంగా అందించబడ్డాయి. కోరికలు నెరవేరడం, విగ్రహం పెరగడం వంటి అంశాలను భక్తుల విశ్వాసాలుగా మాత్రమే పరిగణించాలి.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *