Headlines

BMW కొత్త స్పోర్ట్స్ బైక్ లాంఛ్.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !


ఆటోమొబైల్ దిగ్గజం BMW.. లగ్జరీ కార్లు, ప్రీమియం బైక్‌ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. జర్మనీకి చెందిన ఈ సంస్థ తమ అధునాతన ఇంజినీరింగ్, అత్యుత్తమ పనితీరు, నాణ్యమైన డిజైన్‌తో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా BMW Motorrad విభాగం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రియులకు ఎన్నో ప్రీమియం మోడళ్లను పరిచయం చేస్తోంది. సాధారణ రైడింగ్‌తో పాటు రేసింగ్ అనుభూతిని కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా సూపర్ బైక్‌లను తయారు చేస్తోంది. ఈ సంస్థకు చెందిన M సిరీస్ బైక్‌లు రేసింగ్ టెక్నాలజీ, అధిక వేగం, అత్యాధునిక ఫీచర్లకు పెట్టింది పేరని చెప్పాలి.

ఈ నేపథ్యంలో BMW Motorrad భారత మార్కెట్లో తన ఫ్లాగ్‌షిప్ రేసింగ్ సూపర్ బైక్ కొత్త BMW M 1000 RRను విడుదల చేసింది. ఈ బైక్ బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్ కలర్‌తో పాటు BMW M కలర్ గ్రాఫిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. గత మోడల్‌తో పోలిస్తే ఇంజిన్ పనితీరు, ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ టెక్నాలజీ పరంగా పలు కీలక మార్పులు చేసింది. ఇందులోని 999 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌.. 14500 ఆర్పీఎం వద్ద 215 బీహెచ్పీ పవర్, 11100 ఆర్పీఎం వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా ఈ కొత్త బైక్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.59.90 లక్షలుగా నిర్ణయించారు. మరి ఈ కాస్ట్లీ బైక్ ప్రత్యేకతలు ఏమిటి? పాత మోడల్‌తో పోలిస్తే ఎలాంటి మార్పులు వచ్చాయి? అనే వివరాలు తెలుసుకుందాం…

BMW M 1000 RR ఫీచర్స్..

ఇంజిన్ & పవర్..

కొత్త BMW M 1000 RRలో 999 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 14,500 ఆర్పీఎం వద్ద గరిష్ఠంగా 215 బీహెచ్‌పీ పవర్‌ను, 11,100 ఆర్పీఎం వద్ద 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు. ఇంజిన్‌లోని సిలిండర్ హెడ్, పోర్ట్ డిజైన్, కంబషన్ ఛాంబర్‌తో పాటు టైటానియం వాల్వ్‌లలోనూ మార్పులు చేశారు. ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా అప్‌డేట్ చేశారు. కొత్త షార్ట్ స్ట్రోక్ థ్రాటిల్ సిస్టమ్ మరో ప్రత్యేకత. దీని ద్వారా రైడర్ తక్కువ చేతి కదలికతోనే పూర్తి థ్రాటిల్‌ను పొందవచ్చు. కేవలం 58 డిగ్రీల రొటేషన్‌తో పూర్తి యాక్సిలరేషన్ అందుకునేలా దీన్ని రూపొందించారు.

కొత్త M Winglets 3.0.. మెరుగైన ఏరోడైనమిక్స్

డిజైన్ పరంగా కొత్త BMW M 1000 RR మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. ముఖ్యంగా ముందు భాగంలో కొత్త M Winglets 3.0ను అందించారు. ఇవి కార్బన్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారయ్యాయి. అధిక వేగంతో ప్రయాణించేటప్పుడు బైక్ ముందు భాగం గాల్లోకి లేవకుండా ఈ వింగ్లెట్స్ డౌన్‌ఫోర్స్‌ను పెంచుతాయి. దీంతో రైడర్‌కు మెరుగైన స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా రేసింగ్ ట్రాక్‌లపై వేగంగా ప్రయాణించేటప్పుడు, వేగంగా మలుపులు తీసుకునేటప్పుడు ఇవి కీలకంగా పనిచేస్తాయి.

ఫ్రేమ్‌లో మార్పులు..

కొత్త మోడల్‌లో ఏరోడైనమిక్స్‌తో పాటు ఫ్రేమ్‌ను కూడా అప్‌డేట్ చేశారు. ముఖ్యంగా ఎడమవైపు కొత్త ఇంజిన్ మౌంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్పుల వల్ల బైక్ మలుపులు తీసుకునేటప్పుడు మరింత మెరుగ్గా స్పందిస్తుంది.

కొత్త స్లైడ్ కంట్రోల్ & బ్రేక్ స్లైడ్ అసిస్ట్..

ఈ బైక్‌లో డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (DTC) వ్యవస్థను మరింత మెరుగుపరిచారు. దీనికి స్టీరింగ్ యాంగిల్ సెన్సార్ ఆధారిత స్లైడ్ కంట్రోల్ ఫీచర్‌ను జోడించారు. ఇది రేసింగ్ సమయంలో యాక్సిలరేషన్ తీసుకునేటప్పుడు బైక్ వెనుక చక్రం జారడాన్ని నియంత్రించడంలో రైడర్‌కు సహాయపడుతుంది. అలాగే BMW Race ABS Pro వ్యవస్థలో బ్రేక్ స్లైడ్ అసిస్ట్‌ను అందించారు. బ్రేకింగ్ సమయంలో బైక్ అదుపు తప్పకుండా స్లైడింగ్‌ను నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుంది. రేసింగ్ ట్రాక్‌ల కోసం ప్రత్యేకంగా కొత్త స్లిక్ ABS Pro సెట్టింగ్‌ను కూడా అందించారు.

M Competition Package ప్రత్యేకతలు..

భారత మార్కెట్లో విడుదలైన కొత్త BMW M 1000 RRలో M Competition Packageను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ఇందులో M కార్బన్ వీల్స్, అదనపు కార్బన్ ఫైబర్ భాగాలు ఉన్నాయి. అంతేకాకుండా 220 గ్రాముల బరువు తగ్గించిన M ఫుట్‌రెస్ట్ సిస్టమ్, DLC కోటింగ్‌తో కూడిన M ఎండ్యూరెన్స్ చైన్, మిల్డ్ అండ్ అనోడైజ్డ్ స్వింగార్మ్ పివోట్ పాయింట్ వంటి ప్రత్యేక పరికరాలు ఉన్నాయి. దీనితో పాటు M GPS Laptrigger కోసం యాక్టివేషన్ కోడ్‌ను కూడా అందిస్తున్నారు. ఇది రేసింగ్ ట్రాక్‌పై ల్యాప్ టైమింగ్‌ను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

వారంటీ & రోడ్‌సైడ్ అసిస్టెన్స్..

కొత్త BMW M 1000 RR కొనుగోలుదారులకు కంపెనీ మూడేళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. అవసరమైతే నాలుగో, ఐదో సంవత్సరానికి కూడా వారంటీని పొడిగించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏడాది పొడవునా 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *