రాత్రి భోజనంలో రుచికరమైన చికెన్ వండినప్పుడు, మిగిలిపోయిన కూరను పారేయడానికి ఎవరికీ మనసొప్పదు. మరుసటి రోజు ఉదయం హడావుడిలో వంట చేసే పని లేకుండా ఉంటుందని, దానిని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో దాస్తుంటాం. ఆ తర్వాత బయటకు తీసి వేడి చేసుకుని లాగించేస్తాం. అయితే ఫ్రిజ్‌లో పెట్టినంత మాత్రాన చికెన్ పూర్తిగా సురక్షితంగా ఉంటుందా? అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఆహార భద్రతా నిపుణుల ప్రకారం.. వండిన చికెన్‌ను రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడానికి ఒక నిర్దిష్ట పద్ధతి, కాలపరిమితి ఉంటాయి. నిల్వ చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, ఆ చికెన్ ప్రమాదకరమైన బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. ముఖ్యంగా సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి హానికరమైన బ్యాక్టీరియా కడుపులోకి చేరి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి.
ఫ్రిజ్‌లో చికెన్ ఎన్ని రోజులు సురక్షితం?
అంతర్జాతీయ ఆహార భద్రతా సంస్థలైన USDA, CDC మార్గదర్శకాల ప్రకారం, రిఫ్రిజిరేటర్లో చల్లని ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదింపజేస్తుందే తప్ప, పూర్తిగా అడ్డుకోలేదు. వండిన చికెన్‌ను 4 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద కేవలం 3 నుండి 4 రోజుల వరకు మాత్రమే ఉంచాలి. అంతకంటే ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచితే సూక్ష్మజీవులు నెమ్మదిగా వృద్ధి చెందుతాయి. పైకి వాసన, రుచిలో ఎలాంటి మార్పు కనిపించకపోయినా లోపల చికెన్ పాడైపోయి ఉండే ప్రమాదం ఉంది.
చికెన్ నిల్వ చేయడానికి పాటించాల్సిన 3 ముఖ్య నియమాలు
సమయపాలన: చికెన్ వండిన 2 గంటలలోపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒకవేళ బయటి వాతావరణ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే, వండిన 1 గంటలోపే రిఫ్రిజిరేటర్లో భద్రపరచాలి.
గాలి చొరబడని డబ్బాలు: చికెన్‌ను ఎల్లప్పుడూ గట్టి మూత ఉన్న గాలి చొరబడని పాత్రల్లోనే ఉంచాలి. దీనివల్ల తేమ నిలిచి ఉండటంతో పాటు, ఇతర ఆహార పదార్థాల నుంచి బ్యాక్టీరియా వ్యాపించకుండా ఉంటుంది.
చిన్న భాగాలుగా విభజించడం: ఎక్కువ మొత్తంలో ఉన్న చికెన్‌ను ఒకే పెద్ద గిన్నెలో పెట్టకుండా, చిన్న చిన్న బాక్సుల్లో విభజించి ఉంచాలి. దీనివల్ల చికెన్ త్వరగా చల్లబడి బ్యాక్టీరియా పెరిగే అవకాశం తగ్గుతుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పారేయండి
ఫ్రిజ్‌లోంచి చికెన్ తీసిన తర్వాత తినడానికి ముందు ఈ మూడు అంశాలను కచ్చితంగా పరిశీలించాలి:
వాసన: చికెన్ నుంచి పులిసిన వాసన కానీ, వింతైన లేదా పాడైపోయిన వాసన కానీ వస్తే వెంటనే పడేయాలి.
స్పర్శ: ముక్కలను తాకినప్పుడు జిగటగా లేదా నునుపుగా అనిపిస్తే అది పాడైపోయినట్లే.
రంగు: చికెన్‌పై ఆకుపచ్చ రంగు బూజు లేదా రంగు మారినట్లు కనిపిస్తే అస్సలు తినకూడదు.
తినే ముందు ఎలా వేడి చేయాలి?
పై లక్షణాలేవీ లేకుండా చికెన్ తాజాగా అనిపిస్తే, తినడానికి ముందు దానిని కనీసం 72 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు బాగా వేడి చేయాలి. ఇలా అధిక వేడిపై పూర్తిగా ఉడికించడం వల్ల అందులో ఏమైనా మిగిలి ఉన్న బ్యాక్టీరియా నశించి, ఆహారం సురక్షితంగా మారుతుంది. ఆహారాన్ని వృథా చేయకూడదనే ఆలోచన మంచిదే కానీ, అంతకంటే మన ఆరోగ్యమే ముఖ్యమనే విషయాన్ని మర్చిపోకూడదు.