
పత్తి పంట సాగు చేస్తున్నట్లు కనిపిస్తున్న పొలంలో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగుచూసింది. ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి సుమారు రూ.28 లక్షల విలువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని దంజీనాయక్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ పొలంలో పత్తి పంట మధ్య గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బుధవారం ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పత్తి పంట మాటున పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.28 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వ్యవసాయ పంటల ముసుగులో మాదకద్రవ్యాల సాగుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ వ్యవహారంలో బాధ్యులెవరు? గంజాయి సాగు వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.