Sabarimala Ayyappa Temple: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కీలక హెచ్చరిక. సన్నిధానంలోని ఆలయంలో అయ్యప్ప స్వామి, మలికప్పురమ్మ విగ్రహాలతో పాటు నిషేధిత ప్రాంతాల్లో ఫొటోలు, వీడియోలు తీస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని నిఘా విభాగం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆలయ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. నిషేధిత ప్రాంతాల్లో చిత్రీకరణకు పాల్పడితే అరెస్టు చేయడంతో పాటు మొబైల్ ఫోన్లు, కెమెరాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
శబరిమల సన్నిధానంలోని శ్రీకోవిల్లో ఉన్న అయ్యప్ప స్వామి, మలికప్పురత్తమ్మ విగ్రహాల దృశ్యాలను చిత్రీకరించడంపై నిషేధం ఉంది. అంతేకాకుండా, పతినెట్టంపడి (18 మెట్లు), మెల్తిరుముట్టం, మలికప్పురం వంటి ప్రాంతాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడాన్ని కేరళ హైకోర్టు కూడా నిషేధించింది. అయినప్పటికీ కొంతమంది భక్తులు, యూట్యూబర్లు నిబంధనలను పట్టించుకోకుండా వీడియోలు తీస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దొంగచాటుగా వీడియో రికార్డింగ్..
దర్శనం కోసం సన్నిధానానికి వచ్చే కొంతమంది యూట్యూబర్లు భద్రతా సిబ్బంది కంట పడకుండా వినూత్న పద్ధతుల్లో వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మొబైల్ ఫోన్లలో ముందుగానే వీడియో రికార్డింగ్ ప్రారంభించి, వాటిని చొక్కాలు, జేబులు, జుట్టులో దాచిపెట్టి చిత్రీకరిస్తున్నట్లు వెల్లడైంది. అనంతరం ఈ ఫుటేజీని ఎడిట్ చేసి, అనుమతి ఉన్న ప్రాంతాల్లో తీసిన వీడియోలతో కలిపి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారని సమాచారం.
ఇవి కూడా చదవండి
మరికొందరు వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో లైకులు, షేర్లు, వ్యూస్ కోసం ఇలా చేయడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందా?
శబరిమల అత్యంత కీలకమైన ఆధ్యాత్మిక, భద్రతాపరమైన ప్రాంతం కావడంతో అక్కడి దృశ్యాలను అనధికారికంగా చిత్రీకరించడం ఆందోళన కలిగిస్తోంది. సంఘవిద్రోహ, తీవ్రవాద సంస్థలు ఈ వీడియోలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని నిఘా విభాగం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దేవస్థానం విజిలెన్స్ బృందం ఇప్పటికే విచారణ జరిపి నివేదిక సమర్పించింది. నిషేధిత ప్రాంతాల్లో వీడియోలు, ఫొటోలు తీసేవారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
కాబట్టి శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు ఆలయ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత ప్రాంతాల్లో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.