న్యూఢిల్లీ, నవంబర్ 25: గ్రేట్ ప్లేస్ టు వర్క్ (Great Place To Work) సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత ఉద్యోగ రంగంలో Gen Z వాటా గత మూడేళ్లలో రెట్టింపై 28 శాతానికి చేరుకుంది. 2030 నాటికి ఇది 47 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అంటే దేశంలోని ఉద్యోగుల్లో దాదాపు సగం మంది ఈ తరానికి చెందినవారే కానున్నారు. 100 మందికి పైగా మానవ వనరుల విభాగం (HR) నిపుణులు, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్లు (CHROs) పాల్గొన్న సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వివిధ తరాలకు చెందిన ఉద్యోగులను ఏ అంశాలు ప్రోత్సహిస్తాయో కేవలం పది మందిలో ముగ్గురు HR నిపుణులకు మాత్రమే స్పష్టమైన అవగాహన ఉందని తేలింది.
Gen Z ఉద్యోగులు కంపెనీల నుంచి ఏం కోరుకుంటున్నారు?
- యువ ఉద్యోగులు ముఖ్యంగా కోరుకుంటున్నది పని విషయంలో స్వేచ్ఛ, సౌలభ్యం. ఎప్పుడు, ఎక్కడి నుంచి పనిచేయాలనే విషయంలో కొంత వెసులుబాటు ఉండాలని భావిస్తున్నారు.
- 78 శాతం మంది CHROలు Gen Z ఉద్యోగులకు పని విషయంలో సౌలభ్యం అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
- 59 శాతం మంది ఉద్యోగులు సంస్థలను వీడటానికి ప్రధాన కారణం పని విషయంలో తగిన వెసులుబాటు లేకపోవడమేనని తెలిపారు.
- 66 శాతం మంది HR నిపుణులు హైబ్రిడ్ వర్కింగ్, పని సౌలభ్యం అంశాలే వివిధ తరాల ఉద్యోగుల మధ్య విభేదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
అయితే అన్ని తరాల ఉద్యోగుల అభిరుచులు ఒకేలా ఉండవు. మిలీనియల్స్ ఉద్యోగాల్లో పదోన్నతులు, కెరీర్ ఎదుగుదలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. Gen X, అంతకంటే పెద్ద వయసు ఉద్యోగులు ఉద్యోగ భద్రత, స్థిరత్వం, ముందుగా ఊహించగలిగే పని విధానాన్ని కోరుకుంటున్నారు. అదే సమయంలో అన్ని తరాల ఉద్యోగులు కోరుకునే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. 69 శాతం మంది HR అధిపతులు కెరీర్ పురోగతికి ప్రాధాన్యం ఇచ్చారు. 68 శాతం మంది నమ్మకమైన నాయకత్వం ముఖ్యమని తెలిపారు. పని విషయంలో వెసులుబాటు 60 శాతం మందికి, అర్థవంతమైన పని 58 శాతం మందికి ప్రాధాన్యంగా నిలిచాయి. దీంతో ఉద్యోగుల అవసరాలను అర్థం చేసుకుని, వేర్వేరు తరాలకు తగిన విధంగా సంస్థలు తమ పని విధానాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
యువ ఉద్యోగులు ఎందుకు ఉద్యోగాలు వదిలేస్తున్నారు?
ఉద్యోగులు సంస్థలను వీడటానికి జీతం ఒక్కటే కారణం కాదని ఈ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఉద్యోగంలో చేరిన తొలి రెండేళ్లలోనే చాలామంది సంస్థలను విడిచిపెడుతున్నట్లు తేలింది. సర్వేలో పాల్గొన్న CHROలలో దాదాపు 60 శాతం మంది తొలి రెండేళ్లలో పనిచేసే ఉద్యోగులే సంస్థలను వీడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. ఉద్యోగులు త్వరగా రాజీనామా చేయడానికి ప్రధాన కారణాలు ఇవే..
ఇవి కూడా చదవండి
68 శాతం మంది ఉద్యోగంలో చేరే ముందు ఇచ్చిన హామీలకు, చేరిన తర్వాత ఎదురయ్యే వాస్తవ పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉందని అభిప్రాయపడ్డారు. 64 శాతం మంది మేనేజర్లు, టీమ్‌తో సరైన అనుబంధం లేకపోవడాన్ని కారణంగా పేర్కొన్నారు. 45 శాతం మంది జీతం కూడా ఉద్యోగులు సంస్థలను వీడటానికి ఒక కారణమని తెలిపారు. అయితే నియామకం విజయవంతమైన తర్వాత ఉద్యోగి సంస్థలో సంతృప్తిగా కొనసాగుతున్నాడా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్న సంస్థలు కేవలం 24 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ఉద్యోగులు సంస్థలను త్వరగా వీడకుండా ఉండేందుకు కొన్ని కంపెనీలు కొత్త విధానాలను అమలు చేస్తున్నాయి. కొత్తగా చేరిన ఉద్యోగులతో ఐదో రోజు, ఐదో వారం, ఐదో నెలలో ప్రత్యేకంగా మాట్లాడే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీని ద్వారా ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుంది. మరికొన్ని సంస్థలు అంతర్గత ప్రాజెక్టుల కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేస్తున్నాయి. దీని ద్వారా ఉద్యోగులు ఇతర విభాగాల్లోనూ స్వల్పకాలిక ప్రాజెక్టులు చేపట్టవచ్చు. కొత్త పనులను నేర్చుకునే అవకాశం లభించడంతో పాటు సంస్థను వీడకుండానే తమ కెరీర్లో కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు.
Gen Zను అర్థం చేసుకోవడంలో కంపెనీలు విఫలమవుతున్నాయా?
Gen Z ఉద్యోగుల గురించి గ్రేట్ లేక్స్ గురుగ్రామ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణిమ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Gen Z ఉద్యోగులు ఒక పనిని ఎలా చేయాలి అనే ప్రశ్న కంటే.. ఆ పని ఎందుకు చేయాలి? అనే ప్రశ్నకు ముందుగా సమాధానం కోరుకుంటారని ఆమె తెలిపారు. వారికి ఉద్యోగంలో ఒక లక్ష్యం ఉండాలి. ఏడాదికి ఒకసారి ఇచ్చే సమీక్షల కంటే కొద్ది రోజుల్లోనే ఫీడ్‌బ్యాక్ కావాలని కోరుకుంటారు. ఆదేశాలు ఇచ్చే మేనేజర్ల కంటే మార్గనిర్దేశం చేసే నాయకులను ఇష్టపడతారని వివరించారు. యువత ప్రవర్తనను కొందరు సంస్థల యాజమాన్యాలు హక్కుల కోసం అతిగా పట్టుబట్టడంగా భావిస్తున్నాయని, కానీ వారి పని పట్ల ఆసక్తిని పెంచే అంశాలు గత తరాలతో పోలిస్తే మారాయని ఆమె అభిప్రాయపడ్డారు. Gen Z ఉద్యోగులకు అనుగుణంగా నాయకత్వ శైలిని మార్చుకునే సంస్థలు కృత్రిమ మేధ (AI) పరిజ్ఞానంతో కూడిన ప్రతిభావంతులైన ఉద్యోగులను పొందుతాయని ఆమె పేర్కొన్నారు. మార్పులకు సిద్ధంగా లేని సంస్థలు మాత్రం యువతను అర్థం చేసుకోలేకపోతాయని హెచ్చరించారు.
AIతో మారుతున్న ఉద్యోగ ప్రపంచం
ఒకవైపు Gen Z ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ రంగాన్ని వేగంగా మారుస్తోంది. నేటి యువ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల్లో చేరే సమయానికే అనేక AI టూల్స్‌పై అవగాహన కలిగి ఉంటున్నారు. అయితే అనుభవజ్ఞులైన ఉద్యోగులకు పరిశ్రమలపై లోతైన పరిజ్ఞానం, ఆచరణాత్మక అనుభవం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు తరాల నైపుణ్యాలు కలిస్తే సంస్థలకు గొప్ప ప్రయోజనం కలుగుతుందని ప్రాడిజీ ఫైనాన్స్ గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనల్ కపూర్ అభిప్రాయపడ్డారు. గతంలో పెద్ద ప్రెజెంటేషన్ లేదా ముఖ్యమైన సమావేశానికి సిద్ధమవ్వాలంటే అద్దం ముందు పదేపదే ప్రాక్టీస్ చేసేవాళ్లమని, ఇప్పుడు జనరేటివ్ AI సహాయంతో AI ఏజెంట్‌తో మాట్లాడి, మన ఆలోచనలను పరీక్షించుకుని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం సాధ్యమవుతోందని ఆమె వివరించారు. AI పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదని, కొత్త ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకురాగల సామర్థ్యం కూడా యువతకు అవసరమని పేర్కొన్నారు.
2030 నాటికి ఉద్యోగుల నైపుణ్యాల్లో భారీ మార్పులు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) విడుదల చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025’ కూడా ఉద్యోగ రంగంలో వస్తున్న మార్పుల తీవ్రతను వెల్లడించింది. 2030 నాటికి ఉద్యోగులకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాల్లో 39 శాతం మార్పులు చోటుచేసుకుంటాయని యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ముఖ్యంగా AI, డిజిటల్ టెక్నాలజీ, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మక ఆలోచనలకు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పెరగనుంది. భారత ఉద్యోగ రంగంలో Gen Z తరం కీలక పాత్ర పోషించబోతోంది. వారికి కావాల్సింది కేవలం మంచి జీతం మాత్రమే కాదు.. పని విషయంలో స్వేచ్ఛ, కెరీర్ ఎదుగుదల, నమ్మకమైన నాయకత్వం, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు కూడా. యువత ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగ విధానాలను మార్చుకునే సంస్థలే భవిష్యత్తులో విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.