అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు అధిక లాభాలు వచ్చేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు. తుఫాన్లు, ఎల్‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడేందుకు సాగు విధానాల్లో మార్పులు తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రతి పంట సీజన్ ప్రారంభానికి ముందే పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్!
రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భారీ ప్రణాళికను సీఎం ప్రతిపాదించారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను సమీకరించాలని సూచించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సహకారంతో రూ.40 వేల కోట్లు, మిగిలిన రూ.60 వేల కోట్లను ఇతర పెట్టుబడుల ద్వారా సమకూర్చుకోవాలని తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి ప్రతినెలా పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. ఉద్యాన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్, కొత్త రకాల పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
తుఫాన్లను తట్టుకునేలా సాగు క్యాలెండర్
ఇటీవల వరుస తుఫాన్లు, భారీ వర్షాలు, ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో వచ్చే ఖరీఫ్ నుంచే సాగు క్యాలెండర్లో మార్పులు తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. అవసరమైతే పంటల సాగును ముందుగానే ప్రారంభించి తుఫాన్ల ప్రభావం తగ్గేలా చర్యలు చేపట్టాలన్నారు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పంటల ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. 2027-28 నాటికి 26.5 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించారు.
రైతుల సేవలన్నీ ఒకే యాప్‌లోకి..
వ్యవసాయం, ఆక్వా, ఉద్యానవన రంగాలకు సంబంధించిన సేవలన్నింటినీ ఒకే యాప్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. రైతులకు సాగు సూచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అవసరమైన సమాచారం ఒకే వేదికపై అందించాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని పెంచడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. రైతులతో పాటు కౌలు రైతుల ప్రయోజనాలను కూడా కాపాడాలని స్పష్టం చేశారు.
12.64 లక్షల హెక్టార్లలో పంట నష్టం
ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎల్‌నినో పరిస్థితులు, అర్నబ్, మురసు తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా 26 జిల్లాల్లో 12.64 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. పంట నష్టానికి సంబంధించి రూ.2,743 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ప్రతిపాదించారు. మరోవైపు నష్టపోయిన పంటలకు రూ.1,732 కోట్ల బీమా క్లెయిమ్‌లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రతి రైతుకు పంటల బీమా అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
అలాగే జలధార-2 పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని, అవసరమైతే జలధార-3ను కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు మేకలు, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. డిజి రైతు బజార్ ద్వారా ఇప్పటికే లక్షకు పైగా ఆర్డర్లను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే ఫిబ్రవరి నాటికి మరో 40 మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మొత్తంగా రైతులకు లాభాలు పెంచడం, ప్రకృతి వైపరీత్యాల నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..