Headlines

అమెరికా తొలి అధ్యక్షుడి వెంట్రుకలకు లక్షల్లో ధర.. వేలంలో రికార్డ్!


ఈ వెంట్రుకల కథ 1799లో ఓ విందుతో మొదలైంది. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ తన మరణానికి కొద్దిరోజుల ముందు జాన్ గాడ్స్‌బీ అనే వ్యక్తి ఇంట్లో విందుకు హాజరయ్యారు.  గాడ్స్‌బీకి వాషింగ్టన్‌తో మంచి స్నేహం ఉండేది. ఆ పరిచయం కారణంగానే ఆయనకు వాషింగ్టన్ వెంట్రుకలు లభించాయి. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు. గాడ్స్‌బీ మనవరాలు జూలియా మెక్ బ్లెయిర్ 1928లో ఈ విషయం బయటపెట్టారు. తన తాతకు వాషింగ్టన్‌తో ఉన్న స్నేహానికి గుర్తుగా ఈ వెంట్రుకలు లభించినట్లు చెప్పారు.  వాటిని ఓ ఫ్రేమ్‌లో పెట్టి, ఇంట్లోని వాషింగ్టన్ చిత్రపటం కింద ప్రదర్శనకు ఉంచారు.

కాలక్రమంలో ఈ వెంట్రుకలు గాడ్స్‌బీ వారసుల నుంచి చారిత్రక వస్తువుల సేకరణలో ఆసక్తి ఉన్న జాన్ కె. లాటిమర్ వద్దకు చేరాయి. తాజాగా వేలంలో ఈ ఫ్రేమ్‌ను 4 వేల డాలర్లకు విక్రయించారు. అయితే ఇంతటి చారిత్రక వస్తువును కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు.

గతంలో మూడు వెంట్రుకలకు రూ.30 లక్షలకు పైగా!

వాషింగ్టన్ వెంట్రుకలకు ఇంతకంటే ఎక్కువ ధర కూడా పలికింది. 2021లో ఆయనకు చెందినవిగా భావిస్తున్న మూడు వెంట్రుకలను వేలం వేయగా 40 వేల డాలర్లు లభించాయి. అంటే భారత కరెన్సీలో రూ.33 లక్షలకు పైమాటే! ఆయన మరణించిన సమయంలో సేకరించినట్లు భావిస్తున్న ఈ మూడు వెంట్రుకలను ఓ లాకెట్‌లో భద్రపరిచారు.

ఎవరీ జార్జ్ వాషింగ్టన్?

జార్జ్ వాషింగ్టన్ పేరు అమెరికా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన అమెరికా స్వాతంత్య్ర యుద్ధంలో సైన్యానికి నాయకత్వం వహించి విజయం సాధించారు. అమెరికా రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 1789లో అమెరికా తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగారు. 1797లో అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. 1799లో మరణించారు.

ప్రస్తుతం ఆయన నివసించిన మౌంట్ వెర్నాన్ భవనాన్ని మ్యూజియంగా మార్చారు. అక్కడ ఆయనకు చెందిన కనీసం 50 వెంట్రుకలను కూడా భద్రపరిచారు. వాషింగ్టన్‌కు సంబంధించిన ఇతర వస్తువులకు కూడా వేలంలో మంచి డిమాండ్ ఉంది. 1776లో ఆయన సంతకంతో ఉన్న లేఖ 1,09,800 డాలర్లకు అమ్ముడైంది. ఒకప్పుడు స్నేహానికి గుర్తుగా ఇచ్చిన కొన్ని వెంట్రుకలు రెండు శతాబ్దాలు గడిచినా చరిత్రకు సాక్ష్యంగా నిలిచి వేలంలో వేల డాలర్ల ధర పలకడం విశేషం!

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *