Headlines

చిన్నారుల దగ్గుకు అసలు కారణం ఇదేనా? భారత గాలి నాణ్యతపై షాకింగ్ అధ్యయనం!


నానమ్మ చిన్నప్పుడు వాళ్ల ఇంట్లో అత్యంత ప్రమాదకరమైన గది వంటగది. రోజూ ఉదయం, సాయంత్రం మట్టి పొయ్యి ముందు కూర్చుని కట్టెలు, పిడకలు, ఎండు కొమ్మలతో మంట వేసేది.. పక్కనే ఆమె చిన్నారి బిడ్డ ఆడుకునేది. ఇల్లంతా పొగ నిండి కళ్లలో నీళ్లు తిరిగేవి. చీర కొంగుతో ముఖం తుడుచుకుంటూ, దగ్గుతూనే వంట పూర్తి చేసేది—ఎందుకంటే కుటుంబానికి ఆకలి తీర్చాలి.. దాన్ని ఎవరూ అత్యవసర పరిస్థితిగా పిలవలేదు. కానీ నేడు నానమ్మ గ్యాస్ పొయ్యిపై వంట చేస్తోంది, వంటిల్లు పొగ లేకుండా స్వచ్ఛంగా ఉంది. అయితే ఆమె తొమ్మిదేళ్ల మనవరాలు ‘అను’, నవంబర్ చలిలో బడికి వెళ్తూ బహిరంగంగా వీధిలోనే విపరీతంగా దగ్గుతోంది.. దాన్ని కుటుంబమంతా వాతావరణం మార్పు (The weather) అని సరిపెట్టుకుంటోంది!

నానమ్మ కాలం నుంచి నేటి వరకు ఆ పొగ రూపం ఎలా మారిందో ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ (The Lancet Planetary Health) జర్నల్‌లో ప్రచురితమైన భారీ అధ్యయనం కళ్లకు కట్టినట్లు చూపింది. ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ ఆధారంగా భారతదేశంలోని ప్రతి రాష్ట్రాన్ని విశ్లేషించిన ఈ నివేదిక మన అంచనాలకు అందని వాస్తవాలను బయటపెట్టింది.

సమస్య ఎంత పెద్దది? ఆర్థిక, ప్రాణ నష్టాల లెక్కలు:

ఈ అధ్యయనం ప్రకారం, 2019లో భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా సుమారు 16.7 లక్షల మంది (1.67 మిలియన్లు) ప్రాణాలు కోల్పోయారు. అంటే ఆ ఏడాది దేశంలో నమోదైన మొత్తం మరణాల్లో ఇది 17.8% (దాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరు). (ఇవి డెత్ సర్టిఫికెట్ల లెక్కలు కావు, కాలుష్య ప్రాంతాలు, స్వచ్ఛమైన ప్రాంతాల మధ్య మరణాల తేడాను శాస్త్రీయ నమూనాల ద్వారా అంచనా వేసిన గణాంకాలు.. ఎందుకంటే “గాలి వల్ల చనిపోయారు” అని ఏ సర్టిఫికెట్‌లోనూ రాయరు, కాలుష్యం బలహీనమైన గుండెను, ఊపిరితిత్తులను మరింత దెబ్బతీస్తుంది).

దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం వాటిల్లింది. 2019లో ఉత్పాదకత తగ్గడం వల్ల సుమారు 36.8 బిలియన్ డాలర్ల (దేశ జీడీపీలో 1.36%) నష్టం వాటిల్లగా, వైద్య ఖర్చుల రూపంలో మరో 12 బిలియన్ డాలర్ల భారం పడింది.

ఒక పోరాటంలో విజయం.. మరో పోరాటంలో ఓటమి (1990 – 2019):

కలుషిత గాలి రెండు రకాలుగా ఉంటుంది: ఒకటి కట్టెలు, పిడకలతో వంట చేయడం వల్ల వచ్చే ఇంటి లోపలి కాలుష్యం (Indoor Air Pollution); రెండోది వాహనాలు, ఫ్యాక్టరీలు, దుమ్ము, పంట వ్యర్థాల దహనం, విద్యుత్ ప్లాంట్ల వల్ల వచ్చే బయటి వాయు కాలుష్యం (Outdoor Air Pollution). 1990 నుంచి 2019 మధ్య ఈ రెండింటి తీరు పూర్తిగా మారిపోయింది:

కాలుష్య విభాగం 1990 – 2019 మధ్య మరణాల రేటులో మార్పు ప్రధాన కారణం & ప్రభావం
ఇంటి లోపలి కాలుష్యం (Household Air) 64.2% తగ్గుదల (గొప్ప విజయం) స్వచ్ఛమైన వంట గ్యాస్ వినియోగం పెరగడంతో మహిళలు, పిల్లలకు పొగ బారి నుంచి విముక్తి.
బయటి సూక్ష్మ ధూళి కణాలు (Outdoor PM2.5) 115.3% పెరుగుదల (రెట్టింపు కంటే ఎక్కువ) వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ ధూళి, పంట వ్యర్థాల కాల్చివేత విపరీతంగా పెరగడం.
బయటి ఓజోన్ కాలుష్యం (Outdoor Ozone) 139.2% పెరుగుదల వాతావరణంలో విషవాయువుల సాంద్రత ప్రమాదకర స్థాయికి చేరడం.

అంటే పొగ మాయం కాలేదు—కేవలం ఇల్లు మారింది!.. ఒకప్పుడు గ్రామీణ పేద మహిళలకే పరిమితమైన ప్రమాదం తగ్గి, ఇప్పుడు ఇంటి గడప దాటిన ప్రతి ఒక్కరినీ చుట్టుముట్టే ప్రమాదం పెరిగింది.

అందరికీ ఒకేలా నష్టం ఉందా? అలవాటు పడిన నిర్లక్ష్యం:

విషగాలి ఎవరినీ వివక్ష చూపకుండా తాకినప్పటికీ, అందరికీ ఒకేలా నష్టం చేయదు. రోజంతా ట్రాఫిక్‌లో తిరిగే డెలివరీ రైడర్, భవన నిర్మాణ కార్మికుడు, వీధి వ్యాపారి, వృద్ధులు, పసిపిల్లలు దీని బారిన తీవ్రంగా పడుతున్నారు. స్థోమత ఉన్న కుటుంబం ఎయిర్ ప్యూరిఫయర్ కొనుక్కొని కిటికీలు మూసుకోగలదు.. కానీ రోడ్డు పక్కన టీ అమ్ముకునే వ్యక్తి రోడ్డును మూసివేయలేడు కదా! ఈ సమస్య కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాదని, ప్రతి రాష్ట్రంలోనూ తీవ్రంగా ఉందని అధ్యయనం స్పష్టం చేసింది.

ఇక్కడ మనం గమనించాల్సిన ఒక నిశ్శబ్ద సత్యం ఉంది: ఆకాశం పాల రంగులోకి మారి, ఉదయాన్నే పిల్లలు దగ్గుతున్న రోజులను మనం సీజన్ అని పిలవడం నేర్చుకున్నాం. దానికి అలవాటు పడిపోయాం కాబట్టే ప్రశ్నించడం మానేశాం. ‘అను’ తల్లి నిర్లక్ష్యంగా ఉన్న మనిషి కాదు—తన కూతురి దగ్గు వెనుక ఒక భయానక గణాంకం దాగి ఉందని ఆమెకు ఎవరూ చూపించలేదు అంతే!

నానమ్మకు ఆ పాత పొగ ఇంకా గుర్తుంది. “మా పొగ ఇంట్లోనే ఉండేది, మీ పొగ అంతటా వ్యాపించింది” అంటుందామె. ఒక రకంగా ఆమె చెప్పింది నిజమే, మరో రకంగా కాదు—నాటి వంటింటి పొగ కూడా ప్రాణాంతకమైనదే, కాకపోతే అది తలుపుల వెనుక మహిళలకే పరిమితమైంది.. కాబట్టి గుర్తించడానికి ఎంతో కాలం పట్టింది. అయితే భారతదేశ చరిత్ర ఒక ఆశాకిరణాన్ని కూడా చూపుతోంది.. ఒకప్పుడు సాధారణ విషయంగా అంగీకరించబడిన ప్రమాదాన్ని, దేశం తలుచుకున్నప్పుడు సమర్థవంతంగా తగ్గించగలిగింది.

మనం వంటింటి పొగను విజయవంతంగా తరిమేశాం.. మరి మన వీధుల్లో నిండిన ఈ విషపొగను ఎవరు శుభ్రం చేస్తారు?..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *