Putin Amazed By Indias Rich Language Diversity And Ancient Civilisation Calls It Stunning
Vladimir Putin praises Indian languages: రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్ర ఎంతో ప్రాచీనమైందని, ప్రపంచ నాగరికతల్లో భారతీయ నాగరికతకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ముఖ్యంగా భారత్లో కనిపించే భాషా వైవిధ్యం ఆశ్చర్యపరిచిందని చెప్పారు.
మోదీకి ప్రశ్న.. సమాధానం విని ఆశ్చర్యపోయిన పుతిన్!
ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఇటీవల జరిగిన ఓ సంభాషణను పుతిన్ గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో అధికారిక భాష మాట్లాడే ప్రజలు ఎంతమంది ఉంటారని మోదీని అడిగినట్లు తెలిపారు. అందుకు ప్రధాని సుమారు 60 కోట్ల మంది మాట్లాడతారని చెప్పినట్లు అన్నారు.
అయితే దేశ జనాభా ఎంత ఉంటుందని తాను ప్రశ్నించగా సుమారు 100 కోట్లు అని మోదీ సమాధానమిచ్చినట్లు పుతిన్ వివరించారు. అంటే మిగిలిన వారిలో చాలా మంది తమ తమ ప్రాంతీయ భాషలను మాట్లాడుతున్నారని ఆయన ప్రస్తావించారు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పుతిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకే దేశంలో ఇన్ని భాషలు, విభిన్న సంస్కృతులు ఉండటం నిజంగా అద్భుతమని ప్రశంసించారు. భారతదేశ భాషా వైవిధ్యాన్ని వివరిస్తూ ‘ఇది ఆశ్చర్యకరం కాదా? నిజంగా అద్భుతం!’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
భారతీయ సంస్కృతి గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆసక్తి పెరుగుతోంది!
భారతీయ నాగరికత గురించి కూడా పుతిన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన నాగరికతల్లో భారతీయ నాగరికత ఒకటని దాని చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతి గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు.
‘భారతీయ నాగరికతను ఉదాహరణగా తీసుకోండి. ఇది అత్యంత ప్రాచీనమైంది చాలా ఆసక్తికరమైంది. దాని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంతగా నేను ఆకర్షితుడవుతున్నాను’ అని పుతిన్ అన్నారు.
వేల ఏళ్ల చరిత్ర కలిగిన భారతదేశంలో ఎన్నో భాషలు, మతాలు, సంప్రదాయాలు, సంస్కృతులు కలిసి ఉన్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ప్రతి ప్రాంతానికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ దేశమంతా ఒక్కటిగా నిలవడం భారతదేశం ప్రత్యేకత. ఇప్పుడు ఇదే గొప్పదనాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కొనియాడారు.