Headlines

భారతీయ రైల్వేకు కాసుల వర్షం కురిపించే రైళ్లు ఇవే.. లిస్ట్‌లో మన తెలుగు రాష్ట్రాల ట్రైన్ ఉందా?


173 ఏళ్ల చరిత్ర ఉన్న భారతీయ రైల్వే అంటే కేవలం ఇనుప పట్టాలపై నడిచే యంత్రం మాత్రమే కాకుండా.. కోట్లాది భారతీయుల కలలను మోసుకెళ్లే జీవనాడిగా మారింది. మంచు కొండల నుంచి ఎడారుల వరకు, పచ్చని తీర ప్రాంతాల నుంచి మారుమూల గ్రామాల వరకు భిన్న సంస్కృతులను ఒకే తాటిపై కలిపే అద్భుత వారధిగా నిలుస్తుంది. తరతరాలుగా ఎన్నో కన్నీటి వీడ్కోళ్లకు, మరెన్నో కొత్త ఆశలకు సాక్షిగా నిలిచింది ఈ రైల్వే ప్రయాణం. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ను కలిగి.. ప్రతిరోజూ 2 కోట్ల మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్తుంది.

భారతదేశంలో ప్రతిరోజూ 13452 కంటే ఎక్కువ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, మెయిల్ ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు కూడా పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. కాగా రైల్వే ఆదాయంలో ప్రయాణికుల టికెట్లతో పాటు సరుకు రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. మామూలు రైళ్లతో పాటు సరుకు రవాణా చేసే రైళ్లు కూడా రైల్వేకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అయితే భారతీయ రైల్వేకు అత్యధిక ఆదాయం తెచ్చే రైళ్లు ఏవి ? ఎంత ఆదాయం తెస్తున్నాయో తెలుసుకుందాం..

కాసుల వర్షం కురిపించే రైళ్లు ఇవే..

1. బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్..
2022-23 సంవత్సరం గణాంకాల ప్రకారం బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయాల పరంగా అగ్రస్థానంలో ఉంది. రైలు నంబర్ 22692 బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ నుండి కేఎస్‌ఆర్‌ బెంగళూరుకు ప్రయాణిస్తుంది. ఆ ఏడాదిలో ఈ రైలులో మొత్తం 509510 మంది ప్రయాణించారు. దీంతో దాదాపు రూ.176 కోట్ల, 06 లక్షల 66 వేల 339 ఆదాయం లభించింది.

2. సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్వేస్ రెండవ అత్యధిక సంపాదన కలిగిన రైలు. రైలు నంబర్ 12314 సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ 2022-23 సంవత్సరంలో 5,09,164 మందిని గమ్యస్థానానికి చేర్చింది. దీని కారణంగా ఈ రైలు ఆదాయం రూ.128 కోట్ల 81 లక్షల 69 వేల 274కి చేరుకుంది.

3. దిబ్రూఘర్ రాజధాని..
ఈ జాబితాలో దిబ్రూఘర్ రాజధాని మూడవ స్థానంలో ఉంది. న్యూఢిల్లీ – దిబ్రూగఢ్ మధ్య నడుస్తున్న ఈ రైలు గత ఏడాది 4,74,605 ​​మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చింది. దీని వల్ల రైల్వేకు మొత్తం రూ.126 కోట్ల 29 లక్షల 09 వేల 697 ఆదాయం సమకూరింది.

4. న్యూఢిల్లీ-ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్..
అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే టాప్ 5 రైళ్ల జాబితాలో న్యూఢిల్లీ-ముంబై సెంట్రల్ మధ్య నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ నాల్గవ స్థానంలో ఉంది. రైలు నంబర్ 12952 ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ 2022-23 సంవత్సరంలో 4,85,794 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చింది. దీని కారణంగా రూ. 122 కోట్ల, 84 లక్షల,51 వేల 554 రైల్వే ఖాతాలోకి వచ్చింది.

ఇక ప్రయాణికుల డిమాండ్, టికెట్ ధరలు, ప్రయాణ దూరం వంటి అంశాల ఆధారంగా ఈ రైళ్ల ఆదాయం మారుతూ ఉంటుంది. మొత్తానికి వందేభారత్, శతాబ్ది వంటి ఆధునిక రైళ్లే అత్యధిక ఆదాయం తెస్తాయని చాలామంది భావించినప్పటికీ.. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆదాయంలో తమ సత్తా చాటుతున్నాయి. అయితే వందేభారత్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు వేగం, ఆధునిక సౌకర్యాలతో ప్రయాణ అనుభవం విషయంలో ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. మరోవైపు తెలుగురాష్ట్రాల నుంచి కూడా రైల్వేకు భారీ గానే ఆదాయం లభిస్తున్నా.. ఈ స్థాయిలో రావట్లేదని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *