Headlines

Megastar Chiranjeevi : హాలీవుడ్ టెక్నీషియన్లతో చిరంజీవి సినిమా.. ట్రైలర్ రిలీజ్.. ఆ ఇంగ్లీష్ మూవీ ఎందుకు ఆగిపోయిందంటే..


తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటిన చిత్రాలుగా బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి చిత్రాలను మనం ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం. అయితే, 25 ఏళ్ల క్రితమే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడానికి అటువంటి గొప్ప ప్రయత్నం జరిగింది. ఆ రోజు అనుకున్న ప్రకారం అన్నీ జరిగి ఉంటే, మెగాస్టార్ చిరంజీవి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఉండేవారు. ఆయన ఇమేజ్ హాలీవుడ్ రేంజ్ కి చేరేదేమో. ఆ సినిమా ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్. తమిళ చిత్రరంగ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆంగ్ల చిత్రం బ్లడ్ స్టోన్ (1988)లో నటించిన తర్వాత, తనకు కూడా ఇలాంటి అవకాశం వస్తే బాగుంటుందని చిరంజీవికి అనిపించింది. కొన్ని రోజుల తర్వాత, అమెరికాలో స్థిరపడిన కే రమేష్ కుమార్, సుందరస్వామి, గణేష్ మహాదేవన్ అనే ముగ్గురు దక్షిణాది భారతీయులు హైదరాబాద్ వచ్చి చిరంజీవిని కలిశారు. 1940లో వచ్చిన ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్ర కథకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రాన్ని ఆంగ్లంలో తీయాలని వారు చిరంజీవితో పంచుకున్నారు. ఆ రోజుల్లో ఐదు కోట్ల రూపాయలతో సినిమా అంటేనే భారీ బడ్జెట్ కింద లెక్క. కానీ, ఇది హాలీవుడ్ స్థాయిలో తీసే ఆంగ్ల చిత్రం కనుక 50 కోట్ల రూపాయలతో తీయనున్నట్లు నిర్మాతలు చిరంజీవికి వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించిన చిరంజీవి కథ విని ఉత్సాహం చూపించారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా తీద్దామని నిర్మాతలు చెప్పగానే చిరంజీవి సరేనన్నారు. ఆంగ్ల చిత్రానికి ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని, తెలుగు సినిమాకు అబు బాగ్దాద్ గజదొంగ అని పేర్లు పెట్టాలని నిర్ణయించారు.

హాలీవుడ్ దర్శకుడు డచ్ జెర్సీని ఈ చిత్రానికి దర్శకుడిగా ఎన్నుకున్నారు. 1940లో వచ్చిన ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రంలో సాబు అనే భారతీయుడు హీరోగా నటించారు. ఆ చిత్ర స్ఫూర్తితో, భారతీయ నటుడిని హీరోగా తీసుకోవాలని జెర్సీ అనుకున్నారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఆకర్షించారు. టుమారో నెవర్ డైస్, మమ్మీ చిత్రాలకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన గెయిల్ మాస్టర్‌ను ఎంపిక చేశారు. చిరంజీవి సూచనపై తెలుగు చిత్రానికి సురేష్ కృష్ణను ఎన్నుకున్నారు. చిత్ర యూనిట్‌లో ఎమ్మీని హీరోయిన్‌గా, పెప్సీ కూల్‌డ్రింక్ యాడ్ మోడల్ షాషాను సెకండ్ హీరోయిన్‌గా ఎన్నుకున్నారు. హాలీవుడ్ జేమ్స్ బాండ్ హీరో సీన్ కానరి తనయుడు జసన్ కానరిని విలన్‌గా, ఒమర్ షరీఫ్‌ను కీలకమైన పాత్ర కోసం, బాండ్ గార్ల్ షింటాను మరో ముఖ్య పాత్రకు ఎంపిక చేశారు. తెలుగు వెర్షన్ కోసం చిరంజీవి, ఐశ్వర్య రాయ్ మీద ఒక పాటను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ఆమె వెంటనే ఓకే చెప్పేశారు. ఏఆర్ రెహ్మాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.

ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారంటూ 1999 ఆగస్టు 21 రాత్రి మద్రాస్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆ మర్నాడే చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆ వేడుకలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ హీరో గోవింద మాట్లాడుతూ, సినిమా ప్రపంచంలో అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి త్రిమూర్తుల వంటి వారని అభివర్ణించారు. ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం షూటింగ్ 1999 అక్టోబర్ 4న రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. బాగ్దాద్ గజదొంగ గెటప్‌లో ఉన్న చిరంజీవిపై తొలి షాట్ తీశారు. రెగ్యులర్ షూటింగ్ 11న అజంతా, ఎల్లోరాలలో బాగ్దాద్ ప్యాలెస్‌కి సంబంధించిన ఎక్స్టీరియర్ సీన్స్ చిత్రీకరించారు. ఆ తర్వాత జైసల్మీర్, జోధ్పూర్‌లోని ఎడారికి వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు షూటింగ్ జరిగింది. రాజస్థాన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలతో గ్లిమ్స్ తయారు చేసి బిజినెస్ సర్కిల్స్‌లో ప్రదర్శించారు. చిరంజీవి సినిమాకు ఏడు, ఎనిమిది కోట్ల రూపాయల బిజినెస్ జరిగే ఆ రోజుల్లో, అబు బాగ్దాద్ గజదొంగ చిత్రానికి దాదాపు 12 కోట్ల వరకు బిజినెస్ ఆఫర్లు రావడం విశేషం.

అయితే, అసలు కథ అక్కడే మొదలైంది. 25 శాతం షూటింగ్ పూర్తయ్యి అంతా బాగానే జరుగుతుందని అనుకుంటున్న తరుణంలో రాజస్థాన్‌లోని ఎడారిలో షూటింగ్ జరుగుతుండగా ఒక పుస్తకం అవసరమైంది. ఊహించని సమస్యలు వచ్చాయి. షూటింగ్ ఆపేసి యూనిట్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు అలా ఆగిపోయిన సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కాలేదు. ఈ వివాదం కారణంగా సినిమాకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్షియర్లు వెనకడుగు వేశారు. అలాగే, ముగ్గురు నిర్మాతల మధ్య కూడా అభిప్రాయ భేదాలు తలెత్తడం కూడా సినిమా ఆగిపోవడానికి మరో ముఖ్య కారణం. డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి 2000 సంవత్సరంలో ఇంగ్లీష్ వెర్షన్ ను, మే నెలలో తెలుగు వెర్షన్ ను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వివాదం కారణంగా సినిమానే ఆగిపోయింది. చరిత్ర సృష్టిస్తుందని అనుకున్న మెగాస్టార్ హాలీవుడ్ చిత్రం ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడంతో మెగా అభిమానులు ఎంతో బాధపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *