హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సీవరేజ్ పైప్‌లైన్ అనుసంధాన పనుల నేపథ్యంలో శనివారం రాత్రి నుండి ఆదివారం రాత్రి వరకు ఏకంగా 24 గంటల పాటు తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడమో లేదా లో-ప్రెజర్‌తో రావడమో జరుగుతుందని వెల్లడించారు. నగరంలోని సూరారం చెరువు నుండి శివాలయ నగర్‌లోని 14 ఎంఎల్డీ ఎస్టీపీ వరకు చేపట్టిన 800 ఎంఎం సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తవ్వగా, మిగిలిన 5 శాతం పనులను పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సూరారం ప్రధాన రహదారిలో మల్లారెడ్డి ఆసుపత్రి ఎదురుగా ఉన్న 700 ఎంఎం డయా తాగునీటి పైప్‌లైన్‌ను మార్చాల్సి ఉంది.
శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు బంద్
ఈ కీలకమైన పైప్‌లైన్ మార్పిడి పనులను నవంబర్ 21 రాత్రి 9:00 గంటల నుండి నవంబర్ 22 (ఆదివారం) రాత్రి 9:00 గంటల వరకు నిర్వహించనున్నారు. మొత్తం 24 గంటల పాటు ఈ పనులు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఈ సమయంలో సంబంధిత రిజర్వాయర్ల నుండి నీటి సరఫరాను నిలిపివేయనుండటంతో దిగువ ప్రాంతాల్లోని ఇళ్లకు తాగునీరు అందదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అత్యంత తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాల పూర్తి జాబితా
సూరారం వార్డు పరిధిలో: విశ్వకర్మ కాలనీ, వైష్ణవి నగర్, వేమారెడ్డి నగర్, లక్ష్మీనగర్, సూరారం గ్రామం.
సాయిబాబా నగర్ వార్డు పరిధిలో: తెలుగు తల్లి నగర్, జై భీమ్ నగర్, మైత్రి నగర్, సూరారం కాలనీ.
అధికారుల సూచనలు
శని, ఆదివారాలు కావడంతో ఇళ్లలో నీటి వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పైన పేర్కొన్న కాలనీల నివాసితులు శనివారం రాత్రి 9 గంటల లోపే తమకు అవసరమైనంత తాగునీటిని డ్రమ్ములు, సంపులు, ట్యాంకుల్లో నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ 24 గంటల పాటు నీటిని వృథా చేయకుండా అత్యంత పొదుపుగా వాడుకోవాలని, అభివృద్ధి పనులకు సహకరించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.