Hong Kong Surgeon Accidentally Removes Both Ovaries Despite Orders To Preserve Them
Surgeon Mistake: వైద్యులపై రోగులు పెట్టుకునే నమ్మకం చాలా గొప్పది. ముఖ్యంగా శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో కీలకం. అలాంటిది ముందుగా నిర్ణయించిన చికిత్సా ప్రణాళికను మరిచిపోయి, తొలగించకూడని అవయవాలను కూడా తీసేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? హాంకాంగ్‌లో ఈ ఘటన చర్చకు దారితీసింది.
45 ఏళ్ల మహిళకు ఆపరేషన్.. అసలు ప్లాన్ వేరే!
హాంకాంగ్‌లోని చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ (CUHK) మెడికల్ సెంటర్లో సెప్టెంబర్ 12న ఈ ఘటన జరిగింది. 45 ఏళ్ల మహిళకు గర్భాశయంలో అసాధారణ కణజాల పెరుగుదల ఉన్నట్లు వైద్యులు అనుమానించారు. దీంతో ఆమెకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్‌లో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ మాత్రమే తొలగించాలి. అండాశయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకూడదు. ఈ విషయం ఆపరేషన్ ప్రణాళికలో, రోగి ఇచ్చిన సమ్మతి పత్రాల్లోనూ స్పష్టంగా పేర్కొన్నారు.
కానీ ఆపరేషన్ సమయంలో పొరపాటు జరిగింది. సీనియర్ సర్జన్ గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్‌తో పాటు రెండు అండాశయాలను కూడా తొలగించారు. అంటే ముందుగా నిర్ణయించిన చికిత్సా విధానానికి పూర్తి భిన్నంగా ఆపరేషన్ జరిగింది.
నర్సు గుర్తించడంతో బయటపడిన అసలు విషయం!
ఆపరేషన్ సమయంలో జరిగిన ఈ పొరపాటు వెంటనే బయటపడలేదు. శస్త్రచికిత్స తర్వాత తొలగించిన అవయవాల నమూనాలను పరిశీలించే సమయంలో ఓ నర్సు అనుమానం వ్యక్తం చేశారు. రెండు అండాశయాలు కూడా తొలగించినట్లు గుర్తించారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై ఆసుపత్రి అంతర్గత విచారణ చేపట్టింది. అనంతరం హాంకాంగ్ ఆరోగ్య శాఖకు కూడా సమాచారం అందించింది.
‘రూకీ మిస్టేక్’ తప్పు నాదే: సర్జన్
ఈ ఘటనకు బాధ్యుడైన డాజ చెయుంగ్ టక్-హాంగ్ గైనకాలజికల్ ఆంకాలజీ నిపుణుడిగా పనిచేస్తున్నారు. జరిగిన పొరపాటుపై ఆయన స్పందిస్తూ తన తప్పును అంగీకరించారు. ఆపరేషన్ కొంత క్లిష్టంగా మారిందని, ఒక అంశంపై అతిగా దృష్టి పెట్టడంతో ముందుగా రూపొందించిన అసలు ప్రణాళికను మరిచిపోయానని వెల్లడించారు. తన తప్పును సమర్థించుకోవడానికి ఎలాంటి కారణాలు చెప్పననీ, పొరపాటుకు బాధ్యత వహిస్తాననీ స్పష్టం చేశారు. మరో ఇంటర్వ్యూలో ఈ ఘటనను ‘రూకీ మిస్టేక్’గా అభివర్ణించారు. అంటే అనుభవం లేని వారు చేసే పొరపాటు లాంటిదని బాధిత మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు స్వయంగా క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు.
రెండు అండాశయాలు తొలగిస్తే ఏమవుతుంది?
ఈ ఘటనలో ఆందోళన కలిగించే విషయం మహిళ అండాశయాలను కోల్పోవడం. మహిళల శరీరంలో అండాశయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. రెండు అండాశయాలను తొలగిస్తే ఈ హార్మోన్ల స్థాయులు ఒక్కసారిగా పడిపోతాయి. దీంతో సహజంగా మెనోపాజ్ వచ్చే వయసు కంటే ముందే తక్షణమే మెనోపాజ్ లక్షణాలు కనిపించవచ్చు. హార్మోన్లలో ఆకస్మిక మార్పుల కారణంగా వేడి ఆవిర్లు రావడం, నిద్ర సమస్యలు, మానసిక స్థితిలో మార్పులు, ఎముకల ఆరోగ్యంపై ప్రభావం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా కొన్ని సమస్యలను నియంత్రించవచ్చు.
వైద్యుడిపై చర్యలకు సిద్ధం!
ఈ ఘటనపై CUHK మెడికల్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చుంగ్ కిన్-లాయ్ స్పందించారు. ఆపరేషన్ సమయంలో వైద్యుడు తాత్కాలికంగా ఏకాగ్రత కోల్పోయారని, పరిస్థితిపై అవగాహన లోపించడంతోనే ఈ పొరపాటు జరిగిందని వివరించారు. రోగికి, ఆమె కుటుంబ సభ్యులకు ఆసుపత్రి క్షమాపణలు చెప్పింది. బాధిత మహిళకు అవసరమైన వైద్య సేవలను సర్జన్ స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. వైద్యుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది.
ఒకవైపు సీనియర్ సర్జన్ మరోవైపు ముందుగానే స్పష్టంగా రాసుకున్న ఆపరేషన్ ప్రణాళిక. అయినా చివరకు ఇలాంటి పొరపాటు జరగడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వైద్యరంగంలో ఏకాగ్రత, అప్రమత్తత ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.