Headlines

అయ్యప్ప భక్తులకు అదిరిపోయే న్యూస్‌.. మకర విళక్కు యాత్రకు ప్రత్యేక రైళ్లు!


“స్వామియే శరణం అయ్యప్ప… అంటూ శరణుఘోషతో పంబా తీరం, శబరి గిరులు మార్మోగుతున్నాయి. కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూస్తున్న శబరిమల మండల-మకరవిళక్కు యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం కోసం తరలివస్తుంటారు. అయితే, ఈసారి యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, కేరళ ప్రభుత్వం అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. ఆలయ తలుపులు తెరుచుకోవడం దగ్గరి నుంచి, ప్రత్యేక రైళ్లు, విమానాశ్రయాల్లో హెల్ప్‌డెస్క్‌లు, ఇంటికే ప్రసాదాల డెలివరీ, ఉచిత బీమా వరకు ఎన్నో కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ఆ పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మండల-మకరవిళక్కు పూజల కోసం శబరిమల ఆలయ గర్భగుడి తలుపులు సోమవారం ఉదయం 5 గంటలకే శాస్త్రోక్తంగా తెరిచారు. మంగళవారం నుంచి రోజువారీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు మొదలవుతాయి. మొత్తం 41 రోజుల పాటు సాగే ఈ మండల యాత్ర నవంబర్ 17న ప్రారంభమై, డిసెంబర్ 27 రాత్రితో ముగుస్తుంది. మండల పూజ ముగిసిన తర్వాత ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. తిరిగి ‘మకర విళక్కు’ ఉత్సవాల కోసం డిసెంబర్ 30న ఆలయ తలుపులను మళ్లీ తెరుస్తారు. వచ్చే ఏడాది అంటే 2027 జనవరి 14న పవిత్ర ‘మకర జ్యోతి’ దర్శనం ఉంటుంది. అనంతరం జనవరి 20న ఆలయాన్ని మూసివేయడంతో ఈ ఏడాది రెండు నెలల సుదీర్ఘ యాత్రా కాలం ముగుస్తుంది. శబరిమలకు వెళ్లే తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి – కేరళలోని కొల్లం – చర్లపల్లి మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 27 వరకు మొత్తం 12 సర్వీసులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. చర్లపల్లి – కొల్లం స్పెషల్ ట్రైన్‌ నవంబర్ 20, 27, అలాగే డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో ప్రతి శుక్రవారం రాత్రి 11:45 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఇది ఆదివారం ఉదయం 7 గంటల 55 నిమిషాలకు కొల్లాం జంక్షన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం – చర్లపల్లి స్పెషల్ ట్రైన్‌ నవంబర్ 22, 29, అలాగే డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 40 నిమిషాలకు కొల్లాం నుంచి బయలుదేరి, మరుసటి రోజు అంటే సోమవారం సాయంత్రం 7:00 గంటలకు తిరిగి చర్లపల్లికి చేరుకుంటుంది. రైళ్లు, విమానాల్లో వచ్చే భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శబరిమలకు ప్రధాన రవాణా కేంద్రమైన చెంగన్నూరు రైల్వే స్టేషన్‌లో దేవస్థానం బోర్డు, రైల్వే శాఖ కలిసి ప్రత్యేక వసతులు కల్పించాయి. చెంగన్నూరు మహాదేవ ఆలయంలోనూ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వచ్చే భక్తుల వాహనాలను పంబ సమీపంలోని చకుపాలం పార్కింగ్ ప్రాంతం వరకు అనుమతిస్తారు. అలాగే, విమానాల్లో వచ్చే భక్తుల కోసం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలోలాగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో ఇబ్బంది పడకుండా ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశారు. శబరిమలలోని పవిత్రమైన 18 మెట్లపై గంటకు గరిష్ఠంగా 4 వేల మంది మాత్రమే ఎక్కే అవకాశం ఉంటుంది. రోజుకు 15 గంటల పాటు దర్శనాలు జరిగినా సుమారు 60 వేల మందికే దర్శనం లభిస్తుంది. అంతకంటే ఎక్కువ మంది భక్తులు వస్తే క్యూలైన్లలో రద్దీ పెరగకుండా, కొత్తగా వచ్చే వారిని నిలక్కల్ వద్దే నిలిపివేసి విశ్రాంతి కల్పిస్తారు. దీనికోసం నిలక్కల్‌లో ఒకేసారి 60 వేల మంది సేదతీరేలా భారీ టెంట్లు, తాగునీరు, వాటర్ కూలర్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా, నిలక్కల్‌లో రూ.4.5 కోట్లతో ఏఐ ఆధారిత స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఎంతగానో ఇష్టపడే ‘అరవణ పాయసం’, ‘అప్పం’ ప్రసాదాలకు ఈసారి ఎలాంటి కొరత లేకుండా ఉత్పత్తిని భారీగా పెంచారు. క్యూలైన్లలో నిలబడే పనిలేకుండా సౌత్ ఇండియన్ బ్యాంకు ఐదు ‘సెల్ఫ్ సర్వీస్’ అరవణ కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, డిజిటల్ చెల్లింపుల ద్వారా ఒకేసారి ఐదు టిన్ల అరవణను సులభంగా తీసుకోవచ్చు. అంతేకాదు, భక్తులు ఎక్కువ మొత్తంలో ప్రసాదాలు కొన్నప్పుడు వాటిని ఇంటికి మోసుకెళ్లడం కష్టమవుతుంది. అందుకే.. ట్రావెన్‌కోర్ బోర్డు, ఇండియా పోస్ట్ కలిసి సన్నిధానంలోనే 24 గంటలూ పనిచేసే ప్రత్యేక పార్శిల్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశాయి. దీని ద్వారా భక్తులు ప్రసాదాలను నేరుగా తమ ఇళ్లకు లేదా బంధుమిత్రులకు పోస్ట్ ద్వారా పంపించుకోవచ్చు. శబరిమలకు రాలేని భక్తులు కూడా నేరుగా తమ ఇళ్లకే ప్రసాదాన్ని బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. శబరిమల కొండపై వసతి గదులు పరిమితంగా ఉండటంవల్ల, ఆన్‌లైన్ బుకింగ్ కోసం 250 గదులను కేటాయించారు. ఆన్‌లైన్ కోటా పూర్తయిన తర్వాత, ఖాళీగా ఉన్న గదులను సన్నిధానంలో నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ గదులు దొరకని పక్షంలో భక్తుల కోసం పెద్ద పెద్ద పందిళ్లలో శుభ్రమైన ఉచిత వసతి సౌకర్యాలను బోర్డు కల్పించింది. కేరళ వెళ్లినప్పుడు భాష తెలియక తెలుగు, తమిళ, కన్నడ భక్తులు ఇబ్బంది పడకుండా ఈసారి ఆయా భాషల్లో దారి సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. మైకుల్లో చేసే ప్రకటనలు, భక్తి పాటలు కూడా తెలుగులో వినిపించనున్నాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా, శబరిమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఎల్‌ఐసీ సహకారంతో రూ.2 లక్షల ఉచిత జీవిత బీమా కల్పిస్తున్నారు. యాత్ర సమయంలో అనుకోని ప్రమాదం వల్ల భక్తుడు మరణిస్తే నామినీకి ఈ పరిహారం అందుతుంది. అందుకే వర్చువల్ క్యూ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని బోర్డు సూచించింది. శబరిమల పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడటానికి భక్తులు సహకరించాలని టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ కోరారు. సంప్రదాయం పేరుతో ఉపయోగించిన దుస్తులను పంబ నదిలో పడేయడం వల్ల నది కలుషితమవుతోందని, దీనికి ఆచారాలతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయకుండా, రసాయన రంగులు వాడకుండా శబరిమలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి భక్తుడు బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు. హోటళ్లు, దుకాణాల్లో అధిక ధరలు వసూలు చేయకుండా కఠిన నిఘా పెట్టామని, భక్తులు నిశ్చింతగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక RAC లేదు? రైల్వే శాఖ సంచలన నిర్ణయం!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *