వ్యాయామం చేసేటప్పుడు ఒక్క క్షణం అజాగ్రత్త ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ భయానక ఘటన నిరూపించింది. ఆరోగ్యంగా ఉండాలని జిమ్‌కు వెళ్లిన ఓ యువతికి అక్కడే మృత్యువు ఎదురైంది. కేవలం 30 నిమిషాల పాటు వ్యాయామం చేసిన ఆమె ట్రెడ్‌మిల్‌పై నుంచి కిందకు దిగే సమయంలో అదుపు తప్పింది. వెనక్కు తూలుతూ నేరుగా తెరిచి ఉన్న కిటికీ వైపు వెళ్లింది. పడిపోకుండా కిటికీని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చూస్తుండగానే మూడో అంతస్తు నుంచి కిందపడిపోయింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. జిమ్‌లోని ఓ ట్రెడ్మిల్ 22 ఏళ్ల యువతి ప్రాణాలను బలితీసుకున్న ఈ భయానక ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
జిమ్‌కి వెళ్లిన 30 నిమిషాలకే ఘోరం
ఈ విషాద ఘటన ఇండోనేషియాలోని వెస్ట్ కలిమంతన్ ప్రావిన్స్‌లో ఉన్న పొంటియానక్ నగరంలో చోటుచేసుకుంది. 22 ఏళ్ల యువతి తన తమ్ముడు, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి స్థానికంగా ఉన్న ఓ జిమ్‌కు వెళ్లింది. అక్కడ మూడో అంతస్తులో వ్యాయామం చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె రెండో అంతస్తులోనే వర్కౌట్ చేయాలని బాయ్‌ఫ్రెండ్ సూచించాడు. కానీ ఆమె మాత్రం మూడో అంతస్తులోని జిమ్‌లోనే వ్యాయామం చేసేందుకు వెళ్లింది. అలా జిమ్‌లో అడుగుపెట్టిన అరగంటలోపే ఊహించని ప్రమాదం జరిగింది.
ట్రెడ్మిల్ నుంచి దిగుతుండగా ఒక్కసారిగా వెనక్కి
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలో భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. జిమ్‌లో వరుసగా ట్రెడ్మిల్ యంత్రాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. వాటిలో చివరి వైపు ఉన్న ఓ ట్రెడ్‌మిల్‌పై యువతి వ్యాయామం చేస్తోంది. కొద్దిసేపటి తర్వాత వర్కౌట్ ముగించుకుని యంత్రం నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే కదులుతున్న ట్రెడ్మిల్ బెల్ట్ కారణంగా ఆమె ఒక్కసారిగా వెనక్కి తూలింది.
దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన యువతి వెనుకకు అడుగులు వేస్తూ నేరుగా కిటికీ వైపు వెళ్లింది. అక్కడ కిటికీ తెరిచి ఉండటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. వెంటనే కిటికీ ఫ్రేమ్‌ను పట్టుకుని ఆగేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. క్షణాల్లోనే మూడో అంతస్తు నుంచి కిందపడిపోయింది. ఈ దృశ్యాలు చూసినవారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
Indonesia- The gym was on the third floor of a multi-storeyed building in Pontianak.
In a bizarre accident, a 22-year-old woman Fathiya Nur Eka Rahma died after falling off a treadmill and plunging through an open third-floor window. https://t.co/eOCcGRcWkl
— SK Chakraborty (@sanjoychakra) November 15, 2024
తలకు తీవ్ర గాయాలు.. దక్కని ప్రాణం
ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. పోస్టుమార్టం నివేదికలో తలపై తీవ్ర గాయాలు, పలు చోట్ల గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. అయితే బాధితురాలి పేరును స్థానిక మీడియా వెల్లడించలేదు.
ట్రెడ్మిల్కు కిటికీకి మధ్య దూరం రెండు అడుగులే!
ఈ ప్రమాదానికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. యువతి వ్యాయామం చేస్తున్న ట్రెడ్మిల్కు వెనుకవైపు ఉన్న తెరిచి ఉన్న కిటికీకి మధ్య కేవలం రెండు అడుగుల దూరమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంటే ట్రెడ్‌మిల్‌పై నుంచి వెనక్కి తూలితే నేరుగా కిటికీ గుండా బయటకు పడిపోయే ప్రమాదం ఉంది. ఇంత ప్రమాదకరమైన ప్రదేశంలో ట్రెడ్‌మిల్‌ను ఎలా ఏర్పాటు చేశారనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై పొంటియానక్ నగర పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు, జిమ్ యాజమాన్యం బాధితురాలి కుటుంబానికి క్షమాపణలు చెప్పింది. ఘటన అనంతరం మూడు రోజుల పాటు జిమ్‌ను మూసివేసింది. 2004లో ఈ ఘటన జరిగింది ప్రస్తుతం వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. జిమ్‌లో పరికరాలను ఏర్పాటు చేసే విషయంలో భద్రతా ప్రమాణాలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.