Headlines

మీ ఇంట్లోని ఈ వస్తువులే పాములను ఆకర్షిస్తాయ్.. వెంటనే ఇలా చేయండి..


మీ ఇంట్లోని ఈ వస్తువులే పాములను ఆకర్షిస్తాయ్.. వెంటనే ఇలా చేయండి..

వర్షాకాలంలో నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఇళ్లలోకి పాములు ప్రవేశించడం సాధారణంగా మారింది. వర్షాల కారణంగా భూమిలోని బొరియలు, కన్నాలు నీటితో నిండిపోవడంతో సర్పాలు పొడి ప్రదేశాలు, సురక్షిత ఆశ్రయం కోసం నివాస ప్రాంతాల వైపు పరుగులు తీస్తాయి. అయితే కేవలం ఆశ్రయం కోసమే కాకుండా.. మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు, వాటి ద్వారా వచ్చే వాసనలు కూడా పాములను అనుకోకుండా ఆకర్షిస్తుంటాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉంచాల్సిన ఆ నాలుగు ముఖ్యమైన అంశాలేంటో తెలుసుకోవడం ముఖ్యం.

పాములను ఆకర్షించే 4 ప్రధాన అంశాలు

పక్షులు, వాటి గుడ్ల వాసన

పావురాలు, ఇతర పక్షులు తరచుగా బాల్కనీలు, ఇంటి పైకప్పు మూలలు, ఏసీ అవుట్‌డోర్ యూనిట్ల వెనుక భాగాల్లో గూళ్లు పెడుతుంటాయి. ఈ గూళ్లలోని పక్షి గుడ్లు, చిన్న పిల్లల వాసన పాములను వేగంగా ఆకర్షిస్తుంది. ఆహారం కోసం వెతుకుతూ వచ్చే పాములు ఆ వాసనను పసిగట్టి సులభంగా ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి బాల్కనీలు, ఏసీ పరిసరాల్లోని పాత గూళ్లను ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలి.

ఎలుకలు, చిన్న జీవుల ఉనికి

ఇంట్లోని స్టోర్ రూమ్‌లు, పాత సామాన్లు నిల్వ చేసే గదులు, బాల్కనీల్లో ఎలుకలు తిరుగుతుంటే పాములు వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది. పాములకు అత్యంత ఇష్టమైన ఆహారాల్లో ఎలుకలు ప్రధానమైనవి. ఇంట్లో ఎలుకల సంచారం ఉంటే వాటి వాసనను పసిగట్టి వేటాడేందుకు పాములు నేరుగా లోపలికి వస్తాయి. కాబట్టి నిల్వ గదులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, ఎలుకల బెడద లేకుండా చూసుకోవాలి.

తడి, అధిక తేమ ఉన్న ప్రదేశాలు

పాములు సహజంగానే చల్లని, కాస్త తేమగా, చీకటిగా ఉండే ప్రదేశాల్లో దాక్కోవడానికి ఇష్టపడతాయి. ఇంట్లో పైపుల లీకేజీలు, వాష్‌రూమ్‌ల దగ్గర నిలిచే నీరు, బేస్‌మెంట్లు లేదా గోడల తేమ పాములకు సురక్షితమైన ఆవాసాలుగా మారతాయి. నీటి లీకేజీలను వెంటనే అరికట్టడంతో పాటు, ఇంట్లో మూలలు ఎప్పుడూ పొడిగా, వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

పెంపుడు జంతువుల ఆహారం, వ్యర్థాలు

కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువుల ఆహారాన్ని గిన్నెలలో మూత పెట్టకుండా బయటే వదిలేస్తే, ఆ ఆహారం వాసనకు చిన్న చిన్న కీటకాలు, బల్లులు, ఎలుకలు చేరతాయి. ఇవి పరోక్షంగా పాములను ఆకర్షించడానికి కారణమవుతాయి. అలాగే పెంపుడు జంతువుల విసర్జితాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం కూడా సమస్యను తీవ్రం చేస్తుంది.

పాములు వేటికి భయపడతాయి? ఎలా దూరంగా ఉంచాలి?

పాములకు వాసన చూసే శక్తి చాలా ఎక్కువ. అందుకే కొన్ని రకాల ఘాటైన వాసనలను అవి ఏమాత్రం భరించలేవు.

వెల్లుల్లి, ఉల్లిపాయలు: వీటి నుంచి వెలువడే ఘాటైన సల్ఫర్ వాసన పాములను దూరంగా ఉంచుతుంది.

వెనిగర్, దాల్చినచెక్క – లవంగ నూనె: గుమ్మాల దగ్గర, కిటికీల అంచుల్లో వెనిగర్ లేదా లవంగ నూనెను స్ప్రే చేయడం వల్ల పాములు ఆ పరిసరాల్లోకి రాకుండా నిరోధించవచ్చు.

మొక్కల పెంపకం: ఇంటి పెరట్లో సర్పగంధ, బంతిపూల మొక్కలను పెంచడం వల్ల వాటి నుంచి వచ్చే సహజమైన వాసనలకు సర్పాలు దరిచేరవని నమ్ముతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *