ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్, మేము రోజూ జిమ్ చేస్తున్నాం, ఫిట్‌గా ఉన్నాం, మాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండె సమస్యలు లేవు, మా గుండె ఆరోగ్యంగా ఉందని నిర్లక్ష్యం చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరల్డ్ హార్ట్ డే 2026 థీమ్ ‘Don’t Miss a Beat’ కూడా ఇదే అంశాన్ని నొక్కి చెబుతోంది. బయటకు ఆరోగ్యంగా కనిపించినా లోపల అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, షుగర్ వంటి సైలెంట్ రిస్క్ ఫ్యాక్టర్లు ఉండవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ సురానా మాట్లాడుతూ.. గుండెకు సంబంధించిన ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. గుండె ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. యంగ్ ఏజ్‌లో ఉన్న సమయంలో అయినా సరే ఎప్పుడైనా, ఛాతి నొప్పి , ఆయాసం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు అని సూచిస్తున్నాడు.
యుక్తవయసులోనే తమ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కు సంబంధిచిన సమాచారం తెలుసుకోవాలి. ముఖ్యంగా ధూమపానం, ఊబకాయం, నిద్ర లేమి, కుటుంబంలో ఎవరికి అయినా గుండె పోటు ఉంటే, అలాంటి వారు 20 ఏళ్ల వయసు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాలని ఆయన సూచిస్తున్నారు. చాలా మంది వ్యాయామం చేస్తున్నాం మా గుండె సురక్షితంగా ఉంది అనుకుంటారు. కానీ ఇది చాలా వరకు తప్పు అని ఆయన చెబుతున్నాడు.
వ్యాయామం అనేది రిస్క్ ను తగ్గిస్తుంది కానీ, జన్యుపరమైన, మెటబాలిక్ కారణాలను పూర్తిగా తొలగించలేదన్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజా మార్గదర్శకాల ప్రకారం, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా Lipoprotein(a) పరీక్ష చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది ఫిట్‌గా కనిపిస్తే బాగున్నాం అనుకోవడం అనేది పొరపాటు. ఫిట్ గా కనిపించడం వేరు, గుండె ఆరోగ్యంగా ఉండడం వేరు. క్రమం తప్పకుండా నడక, మంచి ఆహారం, తగిన నిద్ర, పొగాకుకు దూరంగా ఉండడం, కుటుంబ చరిత్ర ఉంటే వైద్యుడిని సంప్రదించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గుండెపోటును ముందే నివారించవచ్చని వారు తెలియజేశారు.




