తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో శరత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కనువిందు చేయనున్న విద్యుత్ అలంకరణలు
గతేడాది కంటే ఈ ఏడాది విద్యుత్ అలంకరణలు మరింత కాంతివంతంగా, సుందరంగా ఉండాలని జేఈవో శరత్ అధికారులకు సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా, అమ్మవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని ప్రతిబింబించేలా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు తిరుపతిలోని ప్రధాన కూడళ్లను విద్యుత్ వెలుగులతో అలంకరించాలని స్పష్టం చేశారు.
గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో పటిష్ట చర్యలు
బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న అభివృద్ధి పనులను జేఈవో పరిశీలించి, వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ముఖ్యంగా భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో ముందస్తుగానే పటిష్టమైన క్యూ లైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు
అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, ఆధ్యాత్మిక ఆనందం కలిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేఈవో సూచించారు. అనంతరం అధికారులతో కలిసి ఉద్యానవనం, ఎంట్రీ-ఎగ్జిట్ మార్గాలు, వాహన మండపం, నాలుగు మాడ వీధులు, గేట్ నెంబర్ 1, 2, 3 ప్రాంతాలను నిశితంగా పరిశీలించి పలు మార్పులు, సూచనలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.