Headlines

Video: కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం.. 10మంది మృతి..


నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. బాగ్లుంగ్ జిల్లాలో సంభవించిన భారీ కొండచరియల ప్రమాదంలో పలు ఇళ్లు మట్టిదిబ్బల కింద సమాధయ్యాయి. ఈ ఘోర దుర్ఘటనలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతయ్యారు. కొండ ప్రాంతం ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల వ్యవధిలోనే లోయలోకి జారిపడుతున్న భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

క్షణాల్లో నేలమట్టమైన గ్రామాలు

బాగ్లుంగ్ ఎస్పీ ఫణీంద్ర ప్రసాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని తమాన్‌ఖోలా, నిసిఖోలా గ్రామీణ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరుచుకుపడి పెను నష్టాన్ని మిగిల్చాయి. తమాన్‌ఖోలా-3 ధరణ్‌సుఖ్ ప్రాంతంలో కొండచరియలు పడి ఓ ఇల్లు కూలిపోవడంతో 80 ఏళ్ల వృద్ధుడు, 66 ఏళ్ల వృద్ధురాలు మట్టి కింద సజీవ సమాధయ్యారు. ఈ గ్రామంలో సుమారు 8 ఇళ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అలాగే తమాన్‌ఖోలా-4 సంతార్ ప్రాంతంలో హస్తబీర్ శ్రీపాలి (50), మరో 65 ఏళ్ల మహిళ శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. కాగా, హస్తబీర్ భార్య ఆచూకీ ఇంకా లభించలేదు. నిసిఖోలా-3 హద్దాహరా పరిధిలోని జుగ్జాఖోలా ప్రాంతంలో ఓ ఇంటిపై కొండచరియలు పడటంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అలాగే నిసిఖోలా-6 రంగిల్‌లో పశువుల పాకపై మట్టి దిబ్బలు పడి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడు. తారాఖోలా-5 ధస్మార్‌లో శనివారం చోటుచేసుకున్న కొండచరియల ఘటనలో మన్ బహదూర్ రోకా (59) అనే వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ముమ్మరంగా సహాయక చర్యలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసి హెచ్చరికలు జారీ చేయడం వల్ల మరిన్ని ప్రాణాలు కాపాడగలిగామని బాగ్లుంగ్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ ఆచార్య తెలిపారు. ప్రతికూల వాతావరణం, నిరంతర వర్షాల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని తెలిపారు.

దేశవ్యాప్తంగా 21 మంది బలి

నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రాథమిక గణాంకాల ప్రకారం.. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. మరో ఐదుగురు ఆచూకీ గల్లంతు కాగా, ఐదుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో నదీ పరివాహక, పర్వత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *