ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదా.. పట్టుకున్నప్పుడు కడదాంలే అని.. మీ వాహనంపై ఉన్న చలాన్‌ను లైట్ తీసుకుంటున్నారా? కానీ ఇకపై అలా కుదరదూ.. మీ కచ్చితంగా మీ వాహనంపై ఉన్న పెండింగ్ ఛలాన్లను చెల్లించాల్సిందే. అవును తాజాగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు పెండింగ్ చలాన్ల వసూలుకు కొత్త మార్గాలను అన్వేషించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది.
వాహనాలపై ఉన్న బకాయి చలాన్ల మొత్తాన్ని వసూలు చేసేందుకు.. వినియోగదారుల విద్యుత్ బిల్లులకు జత చేసి వసూలు చేసే అవకాశాన్ని పరిశీలించాలని తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పర్దీవాలా కేంద్రానికి సూచించారు. విద్యుత్ బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేసే విధానాన్ని కూడా పరిశీలించవచ్చన్నారు.
పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల (RC) పునరుద్ధరణను (రెన్యువల్) నిలిపివేయడం వంటి చర్యలను పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. అటువంటి కేసులలో డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీని ఆపవచ్చని, అలాగే ఆయా వాహనాల యాజమాన్య ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కూడా అడ్డుకోవచ్చని తెలిపింది.వాహనానికి ఉన్న చలాన్లను క్లియర్ చేసే వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను జారీ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
అంతేకాకుండా, పరివాహన్ పోర్టల్‌లో అటువంటి వాహనాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడాన్ని, పెండింగ్ చలాన్లతో లింక్ అయిన డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్‌ను నిలిపివేయడాన్ని కూడా పరిగణించాలని సూచించింది. వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని, ఒకవేళ ఏదైనా వాహనానికి సంబంధించి చెల్లించని ఇ-చలాన్ ఉంటే, అధికారులు అవసరమైతే ఆ వాహనాన్ని సీజ్ చేసేందుకు కూడా చర్యలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది.
అయితే దేశంలో ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే, క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు పరిష్కారాలను కనుగొనాలని జస్టిస్ పార్దివాలా తెలిపారు. అదే సమయంలో, చెల్లించని ట్రాఫిక్ చలాన్లను విద్యుత్ బిల్లులకు జత చేయాలనే ఆలోచన కేవలం విచారణ సమయంలో వచ్చిన ఒక సూచన మాత్రమేనని స్పష్టం చేశారు.




