సినీ తారల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. అయితే కొందరు మాత్రం కెమెరాల ముందు ఎంత యాక్టివ్‌గా ఉన్నా.. తమ పర్సనల్ లైఫ్‌ను మాత్రం చాలా ప్రైవేట్‌గా ఉంచుతారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి తాప్సీ పన్ను కూడా ఒకరు. తన సినిమాలు, కెరీర్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మాత్రం బయటపెట్టదు.
తాప్సీ పన్ను.. మాజీ డెన్మార్క్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, కోచ్ మథియాస్ బోయ్ తో చాలాకాలంగా రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి బంధం దాదాపు 13 ఏళ్లుగా కొనసాగుతోంది. 2024లో వీరి వివాహం జరిగినప్పటికీ, పెళ్లికి సంబంధించిన విషయాలను తాప్సీ పెద్దగా బయటకు తీసుకురాలేదు. సోషల్ మీడియాలోనూ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా తక్కువగా చూపిస్తుంటుంది ఈ అమ్మడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తాప్సీ తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
తన వివాహ బంధానికి పునాది ఏంటో చెబుతూ.. పరస్పర గౌరవమే తమ బంధానికి ప్రధాన కారణమని స్పష్టం చేసింది. తాను బాలీవుడ్లో అడుగుపెట్టిన సమయంలోనే మథియాస్‌తో తన రిలేషన్షిప్ ప్రారంభమైందని తాప్సీ తెలిపింది. ఇన్నేళ్లుగా కలిసి ప్రయాణించిన తమ బంధంపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పింది. జీవితంలో తీసుకున్న నిర్ణయాల్లో మథియాస్‌ను ఎంచుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిన నిర్ణయమని ఈ అమ్మడు పేర్కొంది.
తన కుటుంబం తనకు జీవితంలో లభించిన వరమైతే.. కెరీర్ అనుకోకుండా వచ్చిన అవకాశం అని, కానీ జీవిత భాగస్వామిని మాత్రం తానే ఎంచుకున్నానని తాప్సీ చెప్పింది. అందుకే ఈ నిర్ణయంపై తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. మథియాస్‌తో తమ అనుబంధం గురించి మాట్లాడిన తాప్సీ.. ఇన్నేళ్లుగా తమ మధ్య ఎంతో భద్రత, నమ్మకం ఏర్పడిందని తెలిపింది. అయితే వీటన్నింటికంటే ముఖ్యంగా ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవమే తమ బంధాన్ని బలంగా నిలబెట్టిందని చెప్పింది.
అలాగే సినీ పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు తమ జీవితంలో ప్రేమను వెతుక్కుంటున్నారని తాప్సీ పేర్కొంది. అయితే అదే సమయంలో సంబంధాలను ఎక్కువకాలం కొనసాగించడం ప్రస్తుతం మరింత కష్టంగా మారుతోందని ఆమె అభిప్రాయపడింది. తాత్కాలిక ఆనందాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా.? అనే ప్రశ్నను కూడా ఆమె ప్రస్తావించింది. తన వ్యక్తిగత అనుభవం మాత్రం దీనికి భిన్నంగా ఉందని తెలిపింది. తమ బంధం ఇన్నేళ్లుగా కొనసాగడానికి పరస్పర గౌరవం, అవగాహన, నమ్మకమే కారణమని తాప్సీ చెప్పుకొచ్చింది.




