హైదరాబాద్ శివార్లలో చెడ్డీగ్యాంగ్ కలకలం రేపింది. మణికొండ నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్‌లో చోరీ చేశారు. చెడ్డీగ్యాంగ్ ఫెన్సింగ్‌ను కట్‌చేసి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించింది.. దుండగులకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.. C-బ్లాక్‌లోని మెట్ల మార్గం ద్వారా ఫ్లాట్‌లోకి చొరబడ్డ దొంగలు.. విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.. చెడ్డీగ్యాంగ్‌ను గమనించి ప్రశ్నించిన ఒకరిని ఆయుధాలతో దాడి చేసి.. బెదిరించినట్లు పేర్కొంటున్నారు. సమచారం అందుకున్న పోలీసులు.. అపార్ట్‌మెంట్ కు వెళ్లి పరిశీలించి వివరాలను సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు..
ఎలా.. ఎప్పుడు ప్రవేశించారంటే..
మణికొండలో చెడ్డీ గ్యాంగ్ ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:20 గంటల సమయంలో ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ప్రవేశించింది. లేక్‌సైడ్ వైపు ఉన్న ఫెన్సింగ్‌ను కత్తిరించి అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించిన చెడ్డి గ్యాంగ్ C బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో చోరీ చేశారు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది . ఆరుగురు వ్యక్తులు అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో సంచరిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
వీడియో చూడండి..
అపార్ట్‌మెంట్లకే భద్రత లేకపోతే ఎలా?
సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీల్లో సెక్యూరిటీ గార్డులు, గేట్లు, సీసీ కెమెరాలు, వాచ్‌మెన్ వ్యవస్థ ఉంటాయి. అయినప్పటికీ బయట నుంచి ఫెన్సింగ్ కత్తిరించి దుండగులు లోపలికి వస్తే అపార్ట్‌మెంట్ వాసుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, లైటింగ్, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు..
ఇది ఒక్క అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సమస్యగా కాకుండా నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలకు హెచ్చరికగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..