Headlines

హెల్మెట్ పెట్టుకున్నాడు.. అయినా చలాన్ వచ్చింది..! అసలు ట్విస్ట్ ఏంటంటే..?


బెంగళూరు: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న ఏఐ కెమెరా.. ఈసారి ఓ గిటార్‌నే మనిషిగా భావించింది. ఫలితంగా హెల్మెట్‌ ధరించని పిలియన్ రైడర్ ఉన్నాడంటూ ఏకంగా రూ.500 చలాన్ జారీ చేసింది. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సౌవిక్ దత్తా తన భార్యకు చెందిన ద్విచక్ర వాహనంపై ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. ఆయన హెల్మెట్ ధరించి ఉండటంతో పాటు, తన గిటార్‌ను వీపుపై కట్టుకుని వెళ్తున్నారు. హెల్బల్ నుంచి టిన్ ఫ్యాక్టరీ వైపు వెళ్తున్న సమయంలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ కెమెరా ఆయన వాహనాన్ని క్యాప్చర్ చేసింది. అయితే కెమెరా గిటార్ బ్యాగ్‌ను మరో వ్యక్తిగా గుర్తించినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ‘పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించలేదు’ అనే ఉల్లంఘనతో రూ.500 చలాన్ జారీ అయింది. వాహనం తన భార్య పేరుపై ఉండటంతో చలాన్ ఆమెకు చేరింది. చలాన్‌కు జత చేసిన ఫొటోను పరిశీలించిన దత్తాకు అసలు విషయం అర్థమైంది. ఫొటోలో తాను హెల్మెట్‌తో స్పష్టంగా కనిపిస్తుండగా, తన వెనుక ఉన్న గిటార్‌నే ఏఐ రెండో ప్రయాణికుడిగా గుర్తించినట్లు కనిపించింది. దీనిపై దత్తా సోషల్ మీడియా వేదికగా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేసి, చలాన్‌ను రద్దు చేయాలని కోరారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ ఉల్లంఘన గుర్తింపు వ్యవస్థపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

Ai Traffic Camera

Ai Traffic Camera

ఈ ఘటనపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ, సంబంధిత విభాగాన్ని సంప్రదించి సమస్యను సరిచేయించుకోవాలని దత్తాను కోరారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) కార్తిక్ రెడ్డి కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తామని, పొరపాటు నిజమని తేలితే ఉల్లంఘనను రద్దు చేస్తామని తెలిపారు.

Bengaluru Traffic Police

Bengaluru Traffic Police

ఇక ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సరదాగా స్పందించారు. ‘గిటార్‌ను కూడా పిలియన్ రైడర్‌గా గుర్తించిందా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థల్లో మానవ పరిశీలన కూడా అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ ఘటనతో ఆటోమేటెడ్ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థల సామర్థ్యంతో పాటు, అవి చేసే పొరపాట్లను సరిచేసేందుకు సమర్థవంతమైన వెరిఫికేషన్ వ్యవస్థ ఎంత ముఖ్యమో మరోసారి చర్చకు వచ్చింది. ఏఐ పెద్ద మొత్తంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడంలో సహాయపడుతున్నప్పటికీ.. ఇలాంటి అసాధారణ వస్తువులను తప్పుగా గుర్తించే అవకాశం ఉన్నట్లు ఈ ఘటన చూపిస్తోంది. ప్రస్తుతం ఈ రూ.500 చలాన్ రద్దయిందా లేదా అన్నదానిపై స్పష్టమైన అధికారిక నిర్ధారణ వెలువడలేదు. అయితే.. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల పరిశీలన అనంతరం తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *