కావలసిన పదార్థాలు: తాజా మచ్చలు లేనివి 1 కేజీ పెద్ద ఉసిరికాయలు, కల్లుప్పు పావు కేజీ, 1 నుండి 2 టేబుల్ స్పూన్లు పసుపు, కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, తాలింపునకు సరిపడా జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, తాలింపు సువాసన కోసం కరివేపాకు, ఇంగువ, తాలింపు కోసం నువ్వుల నూనె / పప్పునూనె
తయారీ విధానం: ఉసిరికాయలను నీటితో శుభ్రంగా కడిగి, ఏమాత్రం తేమ లేకుండా పొడి కాటన్ గుడ్డతో పూర్తిగా తుడుచుకుని గాలికి ఆరబెట్టాలి. తడి ఉంటే పచ్చడి బూజు పడుతుంది. ఆ తర్వాత ఉసిరికాయలను చాకుతో గింజ చుట్టూ ఉన్న కండను ముక్కలుగా కట్ చేసుకుని గింజలను వేరుచేయాలి. తడి లేని ఒక గాజు జాడీ లేదా ప్లాస్టిక్ బౌల్లో కట్ చేసిన ఉసిరికాయ ముక్కలను వేయాలి. అందులోనే 250 గ్రాముల కల్లుప్పు, పసుపు వేసి చేతులు పెట్టకుండా గరిటెతో బాగా కలపాలి.
మూతపెట్టి కనీసం మూడు నుండి నాలుగు రోజుల పాటు ఊరనివ్వాలి. ప్రతిరోజూ ఒకసారి పొడి గరిటెతో పైకి కిందకి కలుపుతుండాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు కరిగి, ఉసిరికాయ ముక్కల్లోని రసం (ఊట) సమృద్ధిగా బయటకు వస్తుంది. బాగా ఊరిన ఉసిరికాయ ముక్కలను ఊట రసం నుంచి వేరుచేసి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీ జార్లో అయితే పల్స్ మోడ్‌లో ఒక్కసారి తిప్పితే సరిపోతుంది, మరీ మెత్తటి పేస్ట్‌లా చేయకూడదు. ఇలా తొక్కిన ముద్దను తీసి వేరే పాత్రలో ఉంచాలి.
తొక్కిన ఉసిరి ముద్దను మరియు మిగిలిన ఉప్పు ఊట రసాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లలో వేసి ఎండలో ఒకట్రెండు రోజుల పాటు పెట్టాలి. మరీ డ్రైగా ఎండిపోకూడదు, తేమ పోయి ముద్దలా ఉంటే చాలు. ఆ తర్వాత ఆ ఊటను, తొక్కు ముద్దను కలిపి జాడీలో భద్రపరుచుకోవాలి. ఇది సంవత్సరాల తరబడి నిల్వ ఉంటుంది; రోజులు గడిచే కొద్దీ రంగు ముదిరి నల్లగా మారుతుంది కాబట్టి దీనిని 'నల్ల పచ్చడి' అని కూడా పిలుస్తారు.
మనకు కావలసినంత తొక్కును ఒక గిన్నెలోకి తీసుకుని.. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రను కచ్చాపచ్చాగా దంచి ఇందులో కలపాలి. బాండీలో పప్పునూనె వేడిచేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతో పోపు వేసి ఈ తొక్కులో కలిపితే అద్భుతమైన రుచి వస్తుంది!వేడివేడి అన్నంలో నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకుని ఈ ఉసిరికాయ నల్ల పచ్చడి తింటుంటే అమృతంలా ఉండటమే కాకుండా ఒంటికి ఎంతో చలువ చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది!




