Headlines

రీల్ కాదు.. రియల్ ఛేజింగ్! కారు టాప్‌పై 40 కి.మీ.. స్మగ్లర్లను వెంటాడి పట్టుకున్న పోలీస్..!


తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో సినిమా సన్నివేశాలను తలపించే ఘటన చోటుచేసుకుంది. సుమారు 300 కిలోల నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకునేందుకు ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసం చేశారు. కదులుతున్న కారు పైకప్పుపైకి దూకి ఏకంగా 40 కిలోమీటర్లు ప్రయాణిస్తూ స్మగ్లర్లను వెంబడించారు.

కోవిల్‌పాలయం పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్, సబ్‌ఇన్‌స్పెక్టర్ విఘ్నేష్ సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక నుంచి వచ్చిన ఓ కారును ఆపారు. కారులో అనుమానాస్పదంగా సరుకుల మూటలు కనిపించడంతో ఎస్‌ఐ వాటిని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే కారులో ఉన్న రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా ఎస్‌ఐని పక్కకు నెట్టి, తలుపులు మూసుకుని వేగంగా కారును నడిపారు.

వాహనం తప్పించుకునే ప్రయత్నాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ వెంటనే కారుపైకి దూకి పైకప్పును పట్టుకున్నారు. స్మగ్లర్లు వాహనాన్ని ఆపకుండా విళంకురిచి, కలపట్టి నాలురోడ్డు, చిత్ర మీదుగా కణియూర్ టోల్ బూత్ వైపు దూసుకెళ్లారు. టోల్ ప్లాజా వద్ద కూడా వాహనం బారియర్లను ఢీకొట్టి ముందుకు వెళ్లినట్లు సమాచారం.

కారు పైకప్పుపై వేలాడుతున్న పోలీసును గమనించిన కొందరు వాహనదారులు తమ వాహనాల్లోనే వెంబడిస్తూ ఘటనను సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. సమాచారం అందుకున్న కణియూర్ పోలీస్ పెట్రోల్ వాహనంతో పాటు పలు అంబులెన్స్ సిబ్బంది కూడా వెంటనే రంగంలోకి దిగారు. అవినాశి పోలీసులకు సమాచారం అందించడంతో వారు కూడా వెంబడింపులో చేరారు. చివరకు అవినాశి అన్నపూర్ణ హోటల్ సమీపంలో పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు కలిసి కారును చుట్టుముట్టి అడ్డుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరిని పోలీసులు గాలించి అరెస్టు చేశారు.

విచారణలో బెంగళూరు నుంచి సుమారు 300 కిలోల నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను కోయంబత్తూరుకు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. గుట్కాతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, 40 కిలోమీటర్ల పాటు ప్రాణాలను పణంగా పెట్టి స్మగ్లర్లను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ ధైర్యసాహసాలను స్థానికులు, పోలీసు అధికారులు అభినందిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *