Headlines

Andhra Pradesh: వరద నీటిని ఒడిసిపట్టేలా సరికొత్త ప్లాన్.. మరో రెండు కొత్త బ్యారేజీలకు ప్రతిపాదనలు


భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. భారీ వరద కారణంగా వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అలాగే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు నిర్దేశించారు. నీటి నిల్వలు, భవిష్యత్ సాగునీటి అవసరాలపై సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు. ప్రకాశం బ్యారేజీ ఎగువన.. పులిచింతల-ప్రకాశం బ్యారేజీ మధ్య కొత్త బ్యారేజీ నిర్మాణంతో పాటు ప్రకాశం బ్యారేజీ దిగువన మరో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ రెండు బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరద సమయంలో భారీగా వచ్చే నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు..అవసరమైన ప్రాంతాలకు మళ్లించి నీటి వనరులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.

మరోవైపు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఉదయం 6 గంటలకు 54 వేల 929 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రం 6 గంటలకు 40 వేల 255 క్యూసెక్కులకు తగ్గింది. అంటే 12 గంటల్లో 14,674 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 40 వేల 255 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇందులో గేట్ల ద్వారా 29 వేల క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. కాలువలకు 11 వేల 255 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులుగా ఉంది.

మరోవైపు రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో 29 రిజర్వాయర్లలో 21 టీఎంసీల మేర నీటి నిల్వలు పెరిగాయి. దీంతో వచ్చిన వరద నీటిని రిజర్వాయర్లకు మళ్లించి పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. చిన్న, మధ్య తరహా నీటి వనరులను కూడా నింపాలని..భవిష్యత్ నీటి అవసరాలకు భద్రత కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హిరమండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *