తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని కథానాయికల్లో స్నేహ ఒకరు. సహజమైన అందం, చక్కటి అభినయం, కుటుంబ కథా చిత్రాల్లో ఒదిగిపోయే నటనతో ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో మంచి పేరు సంపాదించారు. స్నేహ అసలు పేరు సుహాసిని. తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఆమె.. తెలుగులోనూ వరుస అవకాశాలు అందుకున్నారు.
గోపీచంద్ హీరోగా తెరకెక్కిన తొలివలపు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్నేహ.. ఆ తర్వాత ‘ప్రియమైన నీకు’ సినిమాతో మరింత దగ్గరయ్యారు. ఆ సినిమా విజయం ఆమె కెరీర్‌కు మంచి ఊపునిచ్చింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, రాధాగోపాళం, శ్రీరామదాసు, మహారధి, మధుమాసం, ఏవండోయ్ శ్రీవారు, పాండురంగడు వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల్లో స్నేహకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అయితే స్నేహ కెరీర్లో జరిగిన ఓ సంఘటన ఆమెను కుంగదీసిందట. కెరీర్ మంచి స్థాయిలో కొనసాగుతున్న సమయంలో తాను ఓ ప్రమాదానికి గురైనట్లు స్నేహ తెలిపారు. ఆ ప్రమాదంలో చేతులు, కాళ్లు, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని.. దాదాపు ఎనిమిది నెలల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని తెలిపారు. కదలడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఆ రోజులు ఎంతో కష్టంగా గడిచాయని స్నేహ గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో తన కెరీర్ ఇక ముగిసిపోయిందేమోనని ఎంతో బాధపడ్డానని, శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగానూ ఆ పరిస్థితి తనను ఎంతో ఇబ్బంది పెట్టిందని ఎమోషనల్ అయ్యారు స్నేహ. అలాంటి క్లిష్ట సమయంలో దర్శకుడు కరు పళనియప్పన్ తనకు అండగా నిలిచారని స్నేహ తెలిపారు. ఆయన తనను కలిసినప్పుడు తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. అయినప్పటికీ తనలో ధైర్యాన్ని నింపి, తిరిగి సినిమాల్లో నటించగలననే నమ్మకాన్ని కలిగించారని ఆమె వెల్లడించారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన పార్థిబన్ కనవు తన కెరీర్లో కీలకమైన చిత్రంగా నిలిచిందని స్నేహ గుర్తుచేసుకున్నారు.
ఆ సినిమా తనను మళ్లీ కెమెరా ముందుకు తీసుకొచ్చిందని చెప్పారు. జీవితంలో ఎదురైన ఆ కష్టమైన సమయంలో తనను మునుపటి కంటే మరింత బలమైన వ్యక్తిగా మార్చిందని ఆమె పేర్కొన్నారు. హీరోయిన్గా ఓ టైంలో టాప్‌లో నిలిచిన స్నేహ.. ఆ తర్వాత తన పాత్రలను మార్చుకున్నారు. కథలో కీలకమైన సహాయ పాత్రలు చేస్తూ కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’, రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ వంటి సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఆమధ్య విజయ్ నటించిన ‘ది గోట్’ చిత్రంలోనూ ఆయన భార్య పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.




