విజయవాడ సమీపంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో మృతురాలి వివరాలను పోలీసులు గుర్తించారు. ఎన్టీపీఎస్ కూలింగ్ కాలువలో లభించిన శరీర భాగాలు మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కల్యాణివిగా పోలీసులు నిర్ధారించారు. మృతురాలి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమెను కల్యాణిగా గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి అప్డేట్ కనిపిస్తోంది. వివాహేతర సంబంధం.. డబ్బు కోసం వేధింపులే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందితుడు షఫీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మంగళగిరి చిన్న తాడినాడకు చెందిన కల్యాణీ.. విభేదాల కారణంగా భర్తకు విడాకులిచ్చింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో మటన్ షాప్ నడిపే షఫీతో కల్యాణీ వివాహేతర సంబంధం కొనసాగించింది. హోటల్లో పనిచేసే కల్యాణి.. విలాసాలకు అలవాటుపడి.. డబ్బు కోసం షఫీని వేధించింది. డబ్బులివ్వకుంటే అత్యాచారం కేసు పెడతానని బెదిరించడంతో షఫీ తట్టుకోలేకపోయాడు. చంపాలని కుట్రపన్నాడు.
మాట్లాడే పని ఉందని భవానీపురంలోని ఇంటికి పిలిచి.. కత్తితో కల్యాణి గొంతుకోసి హతమార్చాడు షఫీ. ఆపై మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికాడు. తల, మొండెం, కాళ్లను బ్యాగ్‌లో కుక్కేసి వాటిని కూలింగ్ కెనాల్లో పడేశాడు. ఈ మొత్తం వ్యవహరంలో షఫీకి దామోదర్, గౌస్, ఆదానీ అలీ సహకరించినట్టు తెలుస్తోంది. వాళ్ల పాత్రపై పోలీసులు వేర్వేరు కోణాల్లో విచారిస్తున్నారు.
ఈనెల 19న కూలింగ్ కెనాల్లో మొండెం కనిపించిందన్న సమాచారంతో పోలీసులు స్పాట్‌కి వెళ్లారు. కెనాల్‌కి సమీపంలో తల, కాళ్లు కూడా కనిపించాయి. ఒంటిపై దుస్తులు, చేతికి ఉన్న టాటూ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో కల్యాణి సోదరుడు పోలీసుల్ని కాంటాక్ట్ అయ్యాడు. డెడ్‌బాడీ కల్యాణీదేనని గుర్తించాడు. ఆమె ఫోన్ కాల్‌డేటా, సాంకేతిక ఆధారాలతో పోలీసులు మర్డర్ మిస్టరీ ఛేదించారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.