Headlines

పాఠశాలలకు 50 మీటర్ల వరకు చిప్స్, కూల్‌డ్రింక్స్, జంక్ ఫుడ్‌ నిషేధం.. పిల్లల ఆరోగ్యంపై కేంద్రం ఫోకస్..!


పిల్లలకు ఇష్టమైన చిప్స్, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు, బర్గర్లు, పిజ్జా వంటి ఆహార పదార్థాల విషయంలో కేంద్రం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పాఠశాలల పరిసరాల్లో అధిక కొవ్వు, అదనపు చక్కెర లేదా ఉప్పు ఉన్న ఆహార పదార్థాల లభ్యతను నియంత్రించే దిశగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చర్యలు చేపడుతోంది. 2026లో జారీ చేసిన ముసాయిదా నిబంధనల్లో ‘అధిక కొవ్వు, అదనపు చక్కెర లేదా ఉప్పు’ ఉన్న ఆహారాలకు ప్రత్యేక నిర్వచనాలు ప్రతిపాదించింది.

ప్రతిపాదిత విధానంలో పాఠశాల ప్రాంగణంతో పాటు దాని చుట్టుపక్కల 50 మీటర్ల పరిధిలో HFSS (High Fat, Sugar or Salt) ఆహారాల విక్రయాలను పరిమితం చేసే నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గతంలోనూ FSSAI పాఠశాలలు, వాటి 50 మీటర్ల పరిధిలో HFSS ఆహారాల విక్రయం, ప్రచారాన్ని నియంత్రించే మార్గదర్శకాలను ప్రతిపాదించింది.

కొత్త ముసాయిదా ప్రకారం, అధిక కొవ్వు, అదనపు చక్కెర లేదా ఉప్పు ఉన్న ఉత్పత్తులను గుర్తించేందుకు నిర్దిష్ట ప్రమాణాలను ప్రతిపాదించారు. ఘన ఆహారాల్లో 100 గ్రాములకు 4.2 గ్రాముల కంటే ఎక్కువ అదనపు కొవ్వు, 3 గ్రాముల కంటే ఎక్కువ అదనపు చక్కెర లేదా 0.625 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు ఉంటే వాటిని సంబంధిత ‘హై’ కేటగిరీలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ద్రవ ఆహారాలకు కూడా ప్రత్యేక పరిమితులను సూచించారు.

ఈ చర్యల ప్రధాన ఉద్దేశం పిల్లలకు సమతుల్యమైన, పోషక విలువలు ఉన్న ఆహారం అందుబాటులో ఉండేలా చేయడం. పాఠశాల వాతావరణంలో అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారాల సులభ లభ్యతను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలని FSSAI మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

అయితే, ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే పాఠశాలల సమీపంలోని కిరాణా దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని చిప్స్, శీతల పానీయాలు, చాక్లెట్లు, ఫాస్ట్‌ఫుడ్ విక్రయించే వ్యాపారాలు తమ ఉత్పత్తుల జాబితాను మార్చుకోవాల్సి రావచ్చు.

ప్రస్తుతం ఇది ముసాయిదా ప్రతిపాదన మాత్రమే. FSSAI 2026 ఆగస్టు 11న సంబంధిత ముసాయిదాను విడుదల చేయగా, దానిపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు అక్టోబర్ 9, 2026 వరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. తుది నిబంధనలు వెలువడిన తర్వాతే ఏ ఆహార పదార్థాలపై, ఏ విధంగా ఆంక్షలు అమలవుతాయో స్పష్టత రానుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *