Headlines

ఈ నెల 25న గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. పోలీసుల హెచ్చరిక ఇదే..


ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు ఘనంగా జరగనున్నాయి. ఖైరతాబాద్, బాలాపూర్ బడా గణనాథుల నిమజ్జనాలకు ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజున నగరవ్యాప్తంగా గణేష్ శోభా యాత్ర జరగనుంది. ఈ క్రమంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుగానే అప్రమత్తమయ్యారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించనున్నారు. గణేష్ మండపాల నిర్వహకులు, ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. దాదాపు నగరవ్యాప్తంగా 20 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొనున్నారు. ఇతర జిల్లాల నుంచి 8400 మంది పోలీసులను నగరంలో భద్రత కోసం వినియోగించుకోనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్రను పరిశీలించేందకు 24 డ్రోన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక 10 వేల సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేశారు. హుస్సేన్ సాగర్ దగ్గర 100 హైరైజ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ నిమజ్జనాలు పూర్తి చేసేందుకు విద్యుత్, అగ్నిమాపక, జలమండలి, హైడ్రా, పోలీస్ డిపార్ట్‌మెంట్లు సమన్వయంగా పనిచేయనున్నాయి. అయితే నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు చేపడుతున్నారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నారు. ఇక ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ ట్రక్కులకు నగరంలోకి అనుమతించకూడదని నిర్ణయించారు. ప్రజలు ట్రాఫిక్ ఆంక్షల గురించి ముందుగానే తెలుసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

ఇక ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం శుక్రవారం జరగనుండగా.. బుధవారం అర్థరాత్రి వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. నిమజ్జనం కోసం సిద్దం చేసేందుకు రెండు రోజుల సమయం పడుతుంది. అందుకే దర్శనాలను ముందుగానే నిలిపివేయనున్నారు. అయితే నిమజ్జనాల్లో అసభ్యకరంగా డ్యాన్సులు వేయడంపై నిషేధం విధించారు. నిబంధనలకు విరుద్దంగా డీజేలు ఉపయోగించినా, అసభ్యకరమైన పాటలు ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.  ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మహిళలపై వేధింపులు చోటుచేసుకోకుండా మఫ్టీలో షీటిమ్స్ తిరగనున్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. చైన్ స్నాచింగ్, ఇతర చోరీలను నిరోధించేందుకు 25 క్రైమ్ విభాగాల బృందాలు ప్రత్యేక నిఘా పెట్టనున్నాయి. నగరంలో ఎక్కడిక్కడ పోలీస్ బందోబస్త్ ఉంటుంది. కమాండ్ కంట్రోల్ సెంట్రల్ నుంచి సీసీ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు పరిశీలన చేపడుతూ ఉంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *