ఒకప్పుడు డిగ్రీ చదివిన యువకుడు క్యాబ్ నడుపుతున్నాడంటే చుట్టుపక్కల వాళ్లు వింతగా చూసేవారు. “డిగ్రీ చదివి ఇదేం పని?” అనే ప్రశ్న ఎదురయ్యేది. ఉద్యోగం అంటే ఆఫీస్, ఒక హోదా, మంచి జీతం.. ఇవే ఉండాలనే ఆలోచన చాలామందిలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఏ పని చిన్నది కాదు.. మనం చేసే పనిని ఎలా చూస్తున్నామన్నదే ముఖ్యం అని కొత్త తరం చెబుతోంది. ఆ మార్పుకు ఉదాహరణగా నిలుస్తున్నాడు బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల హామ్టర్ డెబ్బర్మా.
బీకామ్ చదివి.. స్టీరింగ్ పట్టుకున్నాడు!
హామ్టర్ డెబ్బర్మా బీకామ్ గ్రాడ్యుయేట్. చదువు పూర్తయ్యాక సాధారణ కార్పొరేట్ ఉద్యోగం కోసం వెతకవచ్చు. కానీ అతడు అలా చేయలేదు. చిన్నప్పటి నుంచే కార్లు, డ్రైవింగ్‌పై ఆసక్తి ఉండటంతో.. ఉబర్ బ్లాక్‌లో డ్రైవింగ్ చేసే అవకాశం వచ్చినప్పుడు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. “నాకు నచ్చిన వృత్తిని ఎంచుకోవడంలో తప్పేముంది?” అని చెబుతున్నాడు.తన నిర్ణయం వెనుక పెద్ద కెరీర్ సంక్షోభం ఏమీ లేదని అంటున్నాడు. తనకు నచ్చిన పని చేయాలనుకున్నాడు.. అందుకే స్టీరింగ్ పట్టుకున్నాడు.
వైరల్ అయిన ‘డే ఇన్ మై లైఫ్’ వీడియో
హామ్టర్ తన రోజువారీ జీవితాన్ని చూపిస్తూ ఓ వీడియో చేశాడు. అందులో రోజును ఎలా ప్రారంభిస్తాడు? ప్రయాణికులను ఎలా కలుస్తాడు? అనే విషయాలను చూపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా 23 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మరో విషయం. అతడు షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో ఒక వారంలో సుమారు రూ.46 వేల ఆదాయం కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. “డిగ్రీ చదివి క్యాబ్ ఎందుకు నడుపుతున్నావు?” హామ్టర్‌ను చాలా మంది అడిగారు. సాధారణంగా కాలేజీ చదువు పూర్తయిన వెంటనే ఓ కార్పొరేట్ ఉద్యోగంలో చేరాలని చాలామంది భావిస్తారని అతడు చెబుతున్నాడు. కానీ ప్రతి ఒక్కరి ప్రయాణం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని అన్నాడు. “ప్రస్తుతం నేను తీసుకుంటున్న నిర్ణయాలతో చాలా సౌకర్యంగా ఉన్నాను” అని చెప్పాడు. ఈ పని ద్వారా కొత్త వ్యక్తులను కలుస్తున్నానని, వాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని అన్నాడు.
ప్రతి రైడ్ ఒక కొత్త కథే
హామ్టర్‌కు ఇప్పుడు ఆఫీస్ అంటే నాలుగు గోడలు కాదు.. నాలుగు చక్రాలు. ఒక రోజు కారులోకి వచ్చే ప్రయాణికుడు సాధారణ వ్యక్తి కావచ్చు. మరో రైడ్‌లో వ్యాపారవేత్త, సీఈఓ లేదా కంటెంట్ క్రియేటర్ ఉండొచ్చు. “ఈ రోజు ఎవరిని కలుస్తానో ముందుగా తెలియదు. ప్రతి ప్రయాణికుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రయాణికులతో మాట్లాడటం, వారి అనుభవాలను తెలుసుకోవడం తనకు ఇష్ట”మని అంటున్నాడు. అంతేకాదు.. డ్రైవింగ్ పూర్తయ్యాక కంటెంట్ క్రియేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి తన ఆసక్తులపై కూడా దృష్టి పెడుతున్నాడు.
రూ.46 వేలు మాత్రమే అసలు కథ కాదు!
వారానికి రూ.46 వేల ఆదాయం అనే విషయం ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. తన కథను కేవలం సంపాదనతో చూడొద్దని హామ్టర్ చెబుతున్నాడు. తాను ఎంత సంపాదిస్తున్నా అన్నది తన అనుభవానికి కొలమానం కాదని, ఎన్ని గంటలు డ్రైవ్ చేస్తాడన్న దాన్ని బట్టి ఆదాయం మారుతుందనీ, తనకు ఈ పనిలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ చాలా ముఖ్యమని అన్నాడు. ఇక డ్రైవింగ్‌లో తనకు గుర్తుండిపోయిన ఓ ఘటనను హామ్టర్ పంచుకున్నాడు. ఓసారి థామస్ అనే పాస్టర్ ను ప్రయాణికుడిగా కలిశాడట. కారు దిగే సమయంలో ఆ వ్యక్తి హామ్టర్ భవిష్యత్తు బాగుండాలని ప్రార్థించాడట. “ఇది చాలా చిన్న సంఘటనే. కానీ నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇప్పటికీ గుర్తుంది” అని హామ్టర్ చెబుతున్నాడు.
ఇది ఒక్క హామ్టర్ కథ మాత్రమే కాదు!
విద్యార్హతలు ఉన్నప్పటికీ డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న యువతలో హామ్టర్ ఒక్కరే కాదు. 22 ఏళ్ల రుద్రకు బీసీఏ డిగ్రీ ఉంది. గతంలో నోయిడాలో ఫైనాన్స్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పని చేయాల్సి రావడం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో జీవన వ్యయంతో పోలిస్తే జీతం తక్కువగా అనిపించడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. మొదట తాను క్యాబ్ నడపడం ప్రారంభించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదట. ఇప్పుడు రోజుకు సుమారు రూ.5 వేల సంపాదన లక్ష్యంగా పెట్టుకున్నాడు.
మరోవైపు భవన అనే మహిళ రెండేళ్లకు పైగా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తోంది. మొదట డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చింది. రోడ్డుపై మొదటిసారి కారు నడిపేటప్పుడు భయపడింది. కానీ కుటుంబ సభ్యులు, భర్త, పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు సాగింది. ఇప్పుడు ప్రొఫెషనల్‌గా కారు నడపడం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఆమె చెబుతోంది.
పని చిన్నదా? మన ఆలోచనే చిన్నదా?
హామ్టర్ కథలో అసలు విషయం రూ.46 వేల ఆదాయం కాదు. తనకు నచ్చిన పని చేయడానికి సమాజం ఏమనుకుంటుందో పట్టించుకోకపోవడమే అతడి కథలో కీలకమైన విషయం. డిగ్రీ ఉంటే ఆఫీసులోనే పని చేయాలా? మంచి చదువు ఉంటే డ్రైవింగ్ చేయకూడదా? ఉద్యోగానికి హోదా తప్పనిసరిగా ఉండాలా? ఈ ప్రశ్నలకు హామ్టర్ తనదైన రీతిలో సమాధానం చెబుతున్నాడు. “ఏ పని చిన్నది కాదు.. పెద్దది కాదు. మనం ఆ పనిని చూసే విధానమే ముఖ్యం. ఇప్పటి యువతలో మారుతున్న ఆలోచనకు హామ్టర్ కథ ఓ ఉదాహరణగా నిలుస్తోంది.