Headlines

‘మీది మొత్తం రూ.1000.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’.. కుమారి ఆంటీ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా?


‘మీది మొత్తం రూ.1000.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’.. కుమారి ఆంటీ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా?

ఒకప్పుడు రోజంతా పొలం పనులు చేస్తే వచ్చేది రూ.50 కూలీ. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో భర్తతో కలిసి హైదరాబాద్‌ వచ్చారు. చేతిలో పెద్దగా పెట్టుబడి లేదు.. వెనుక ఎలాంటి బిజినెస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. అయినా ఓ చిన్న ఫుడ్‌ బిజినెస్‌ను మొదలుపెట్టారు. అదే వ్యాపారం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు ఫుడ్‌ బిజినెస్‌తో పాటు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీ.. తాజాగా తన జీవిత ప్రయాణంతో పాటు హోటల్‌ బిజినెస్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ ప్రాంతంలో రోడ్డు పక్కన చిన్న హోటల్‌తో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు సెలబ్రిటీ స్థాయికి చేరింది. ముఖ్యంగా ‘మీది మొత్తం రూ.1000 అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అనే మాట సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ కావడంతో కుమారి ఆంటీ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆమె హోటల్‌కు వెళ్లి ఫుడ్‌ టేస్ట్‌ చేయడం కోసం చాలామంది ఆసక్తి చూపించారు. యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆమె హోటల్‌ను సందర్శించడంతో మరింత పాపులారిటీ వచ్చింది.

అయితే తనకు వచ్చిన ఫేమ్‌ అంతా సోషల్‌ మీడియా వల్లే అనుకోవద్దని కుమారి ఆంటీ చెబుతున్నారు. తాను వైరల్‌ కావడానికి చాలా కాలం ముందే హోటల్‌కు మంచి గిరాకీ ఉండేదని తెలిపారు. కరోనా కంటే ముందే తన హోటల్‌కు ప్రత్యేకమైన కస్టమర్‌ బేస్‌ ఉండేదని చెప్పారు. సినిమా షూటింగులు జరిగినప్పుడు కూడా నటీనటులు, షూటింగ్‌ సిబ్బంది తమ హోటల్‌ నుంచే భోజనం తీసుకునేవారని గుర్తుచేసుకున్నారు. సుడిగాలి సుధీర్‌ నటించిన ఓ సినిమా షూటింగ్‌ కూడా తమ హోటల్‌లో జరిగిందని ఆమె తెలిపారు.

ఇక తన అసలు ప్రయాణం మాత్రం హైదరాబాద్‌తో మొదలుకాలేదని కుమారి ఆంటీ చెప్పారు. సొంతూరులో ఉన్న సమయంలోనే కుట్టు మెషీన్‌ నడిపేవారట. అదే సమయంలో పొలం పనులకు కూడా వెళ్లేవారు. తెల్లవారుజామున 5 గంటలకే పొలం పనులకు వెళ్లి సాయంత్రం వరకు కష్టపడేవారిని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో రోజుకు కేవలం రూ.50 కూలీ మాత్రమే వచ్చేదని తెలిపారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడాలనే ఆలోచనతో భర్తతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి 2011లో ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించినట్లు వెల్లడించారు.

చిన్నగా మొదలైన వ్యాపారం క్రమంగా పెరిగింది. ప్రస్తుతం తన హోటల్‌కు రోజుకు సుమారు వెయ్యి మంది వరకు వస్తున్నారని కుమారి ఆంటీ తెలిపారు. అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడానికి ముందు మాత్రం రోజుకు దాదాపు 1500 మంది వరకు కస్టమర్లు వచ్చేవారని చెప్పారు. తన దగ్గరకు వచ్చే వారిలో నాన్‌వెజ్‌ కోరుకునేవారే ఎక్కువగా ఉంటారని.. దాదాపు 90 శాతం మంది నాన్‌వెజ్‌ ఆర్డర్‌ చేస్తారని తెలిపారు. హోటల్‌లో భోజనం చేసినవాళ్లు ఇంటికి కూడా పార్సిల్‌ తీసుకెళ్తుంటారని చెప్పారు.

ఆమె హోటల్‌లో వంట ప్రక్రియ కూడా తెల్లవారుజామునే మొదలవుతుంది. ఉదయం 4.30 గంటలకే వంటలు ప్రారంభించి.. మధ్యాహ్నం 3 గంటలలోపే ఆ రోజు ఫుడ్‌ మొత్తం అయిపోతుందని కుమారి ఆంటీ తెలిపారు. నాన్‌వెజ్‌ కావాలనుకునేవారు ముందుగానే రావాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కో కస్టమర్‌ సగటున రూ.200 వరకు ఖర్చు చేస్తారని.. రోజుకు రూ.20 వేల వరకు కౌంటర్‌ ఉంటుందని వెల్లడించారు.

అయితే కౌంటర్‌పై కనిపించే మొత్తం తన లాభం కాదని ఆమె స్పష్టం చేశారు. హోటల్‌ నిర్వహణలో ఖర్చులు కూడా భారీగానే ఉంటాయని తెలిపారు. గతంలో కిలో చికెన్‌ రూ.140-170 మధ్య ఉండేదని.. ఇప్పుడు దాదాపు రూ.300 వరకు చేరిందన్నారు. బియ్యం ధర కూడా బాగా పెరిగిందని, గతంలో రూ.1000కు వచ్చిన బియ్యం ఇప్పుడు రూ.1800 వరకు ఉంటోందని చెప్పారు. పప్పులు, ఉప్పులు, ఇతర వంట సరుకుల ధరలు కూడా పెరగడంతో ఆదాయం పెరిగినంత మాత్రాన లాభం పెరగడం లేదని వివరించారు.

ఫుడ్‌ బిజినెస్‌తో వచ్చిన గుర్తింపు ఇప్పుడు ఆమెను సినిమా రంగం వైపు కూడా తీసుకెళ్లింది. ప్రస్తుతం తాను ఏడు సినిమాల్లో నటిస్తున్నానని కుమారి ఆంటీ వెల్లడించారు. చిన్న చిన్న పాత్రలే అయినప్పటికీ.. తనను అభిమానించే వాళ్ల కోసం సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పాంచాలి పంచభర్తృక’ సినిమాలోనూ ఆమె కనిపించారు. తన సినిమా ప్రయాణాన్ని కూడా హోటల్‌ బిజినెస్‌తో ముడిపెట్టుకున్నారు కుమారి ఆంటీ. ‘పాంచాలి పంచభర్తృక’ సినిమా చూసిన ప్రేక్షకులు టికెట్‌ తీసుకొచ్చి చూపిస్తే.. తన హోటల్‌ ఫుడ్‌ బిల్లులో రూ.100 తగ్గిస్తానని ప్రకటించారు. దీంతో మరోసారి ఆమె పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉందని కూడా కుమారి ఆంటీ చెప్పారు. గతేడాది ‘బిగ్‌బాస్‌’ నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని.. అయితే అప్పట్లో ఆ అవకాశాన్ని అంగీకరించలేదని తెలిపారు. మరోసారి అవకాశం వస్తే మాత్రం ఈసారి వదులుకోనని చెప్పారు.

ఓ చిన్న హోటల్‌తో మొదలైన ప్రయాణం.. సోషల్‌ మీడియా ఫేమ్‌ నుంచి సినిమాల వరకు వెళ్లింది. ఇప్పుడు బిగ్‌బాస్‌ అవకాశం కోసం కూడా ఎదురుచూస్తున్నానని చెబుతున్నారు కుమారి ఆంటీ. తన మాటల్లో చెప్పాలంటే.. ఇది ఒక్కరోజులో వచ్చిన పాపులారిటీ కాదు. ఎన్నో ఏళ్ల కష్టం, వ్యాపారంపై నమ్మకం, పరిస్థితులకు తగ్గట్టు ముందుకు వెళ్లాలనే పట్టుదలతో నిర్మించుకున్న ప్రయాణం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *