Headlines

Andhra Pradesh: కారులో 2కోట్లు పెట్టి జిమ్‌కు వెళ్లిన వ్యక్తి.. తిరిగొచ్చేసరికి ఊహించని సీన్..


Andhra Pradesh: కారులో 2కోట్లు పెట్టి జిమ్‌కు వెళ్లిన వ్యక్తి.. తిరిగొచ్చేసరికి ఊహించని సీన్..

నమ్మిన బంటే యజమాని గొంతు కోశాడు. క్షణాల వ్యవధిలో కళ్లుగప్పి ఏకంగా రూ.2 కోట్ల నగదుతో ఉడాయించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన ఈ భారీ చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేష్ కుమార్ తన వ్యాపార అవసరాల నిమిత్తం కారులో రూ.2 కోట్ల నగదును ఉంచి ఉదయం నగరంలోని ఓ జిమ్‌కు వెళ్లారు. కారును, అందులోని నగదును నమ్మకస్తుడైన తన డ్రైవర్‌కు అప్పగించి ఆయన జిమ్‌లోకి వెళ్లారు. వ్యాయామం ముగించుకుని తిరిగి బయటకు వచ్చి చూసేసరికి సురేష్ కుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. అక్కడ కారు మాత్రమే ఉంది తప్ప డ్రైవర్ కనిపించలేదు. అనుమానంతో కారు లోపల పరిశీలించగా అందులో ఉండాల్సిన రూ.2 కోట్ల నగదు మాయమైనట్లు గుర్తించారు.

రంగంలోకి పోలీసులు.. గంటల్లోనే..

తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంతో పాటు జిమ్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవర్ కదలికలు, అతడి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

పోలీసులు వేగంగా స్పందించి దర్యాప్తు చేపట్టడంతో నిందితుల ఆట ఎక్కువసేపు సాగలేదు. రూ.2 కోట్ల నగదుతో పరారైన డ్రైవర్‌ను, అతడికి సహకరించిన కాకినాడకు చెందిన స్నేహితుడిని దేవరపల్లి సమీపంలో వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును రికవరీ చేసే పనిలో పడ్డ పోలీసులు, ఇద్దరినీ రాజమహేంద్రవరం తరలించి లోతుగా విచారిస్తున్నారు. నమ్మకంగా పనిచేస్తూ ఇంత పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడటం వెనుక ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *