
ప్రతిరోజు ఉదయం టీ, కాఫీలకు బదులుగా పరగడుపున మునగాకు, ఉసిరికాయతో చేసిన హెల్త్ షాట్ (30 ml) తాగడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ పానీయంలో విటమిన్ సీ, ఐరన్, కాల్షియం, జింక్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. చర్మానికి సహజమైన కాంతిని, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను సైతం తగ్గిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధం. తయారీ విధానం, మరిన్ని లాభాలు ఏంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
కావలసిన పదార్థాలు, తయారుచేసే విధానం:
ఉసిరికాయలు 2, లేత మునగాకు లేదా మునగాకు పొడి 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, చిన్న అల్లం ముక్క, జీలకర్ర పావు స్పూన్, మిరియాలు 6, చిటికెడు పసుపు, గులాబీ ఉప్పు పింక్ సాల్ట్. వీటిని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో మెత్తగా రుబ్బి, వడకట్టుకోవాలి. వచ్చే చిక్కటి రసంలో చిటికెడు ఉప్పు కలుపుకుంటే ఆరోగ్యకరమైన మునగాకు-ఉసిరి షాట్ సిద్ధమవుతుంది.
ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు:
జీర్ణవ్యవస్థ శుద్ధి:
పరగడుపున ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ వేగవంతమవుతుంది. ఇది కాలేయం, పేగుల్లో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
మెరుగైన రోగనిరోధక శక్తి:
ఉసిరిలోని విటమిన్ సీ, మునగాకులోని ఐరన్, కాల్షియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా ఇది కవచంలా పనిచేస్తుంది.
కాంతివంతమైన చర్మం, దృఢమైన జుట్టు:
ఉసిరిలోని విటమిన్ సీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలు, మచ్చలను తగ్గిస్తుంది. మునగాకులోని పోషకాలు జుట్టు కుదుళ్లను దృఢపరిచి చుండ్రును నివారిస్తాయి. ఉదయాన్నే దీనిని తీసుకోవడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది.
బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణ:
మునగాకు, ఉసిరి, కరివేపాకు మూడూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో మేటిగా పనిచేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా 30ml వరకు ఈ హెల్త్ షాట్ తీసుకోవడం వల్ల నీరసం తగ్గి, రోజంతా శరీరం ఉత్సాహంగా, చురుగ్గా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..