Headlines

టికెట్ అడిగితే రచ్చ.. చివరికి తన బట్టలనే చించుకున్న యువతి.. షాకింగ్ వీడియో వైరల్!


రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ మహిళ.. టికెట్ తనిఖీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టికెట్ తనిఖీ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించే ప్రయత్నంలో ఆమె తన బట్టలను తానే చించుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, మరో ప్రయాణికుడు ఈ మొత్తం వ్యవహారాన్ని తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సెప్టెంబర్ 17న దానాపూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దానాపూర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారితో కలిసి ప్రయాణిస్తున్న మహిళ తొలుత సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రైలు దానాపూర్ నుంచి బయలుదేరిన తర్వాత టికెట్ తనిఖీ సిబ్బంది ప్రయాణికుల టికెట్లను పరిశీలించారు. మహిళను టికెట్ చూపించాలని కోరగా ఆమె చెల్లుబాటు అయ్యే టికెట్ చూపించలేకపోయిందని అధికారులు తెలిపారు. దీంతో ఆమెను టికెట్ తీసుకోవాలని కోరగా, ఆమె థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లోకి వెళ్లింది.

టీటీఈతో వాగ్వాదం.. బట్టలు చించుకున్న మహిళ

థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లోనూ తనిఖీ సిబ్బంది ఆమెను టికెట్ చూపించాలని కోరారు. తాను డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మహిళ చెప్పగా, చెల్లుబాటు అయ్యే టికెట్ అవసరమని సిబ్బంది చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆమె సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. తన సోదరుడు కూడా టీటీఈగా పనిచేస్తున్నాడని చెప్పిన మహిళ.. రైల్వే పోలీసుల హెల్ప్‌లైన్ కోసం తన ఫోన్‌లో వెతుకుతూ, సిబ్బందిని ఇరికిస్తానని హెచ్చరించినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ఒక్కసారిగా తన బట్టలను తానే చించుకున్నట్లు రికార్డింగ్‌లో కనిపించింది.

రైల్వే స్టేషన్‌లో దించిన ఆర్పీఎఫ్

ఈ ఘటనపై టీటీఈలు డివిజనల్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. సాయంత్రం సుమారు 4 గంటలకు రైలు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ చేరుకోగానే ఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మహిళను రైలు నుంచి దించి విచారించారు. ఈ ఘటనను రికార్డ్ చేసిన ప్రయాణికుడు తన వద్ద ఉన్న వీడియోను రైల్వే సిబ్బందికి చూపించాడు. ఆ ఫుటేజీ ఆధారంగా కోచ్‌లో జరిగిన పరిణామాలను అధికారులు పరిశీలించారు. చివరకు మహిళకు రైల్వే నిబంధనల ప్రకారం జరిమానా విధించి, టికెట్ జారీ చేసిన అనంతరం వెళ్లేందుకు అనుమతించినట్లు అధికారులు తెలిపారు. కాగా, తనిఖీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలను రైల్వే అధికారులు ఖండించారు. మొత్తం ఘటనపై ప్రయాణికుడు తీసిన వీడియో కీలక ఆధారంగా మారిందని అధికారులు తెలిపారు.

షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *