Headlines

కడుపున పుట్టిన కొడుకే ఇంటి నుంచి గెంటేస్తున్నాడు.. తల్లిదండ్రుల నిరసన..


కన్న కొడుకే ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నాడంటూ ఓ వృద్ధ దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వయస్సులో తామెక్కడికి వెళ్లాలి.. భార్య గుండె జబ్బుతో బాధపడుతోంది.. మాకు న్యాయం చేయండి.. అంటూ తమ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటన శనివారం కరీంనగర్‌ కోతిరాంపూర్‌లో చర్చనీయాంశంగా మారింది. జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన దేవులపల్లి లక్ష్మణ్‌ 2010లో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు కుమారుడు రవికుమార్‌, కుమార్తె ఉన్నారు. రవికుమార్‌ హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారని, నెలకు సుమారు రూ.8 లక్షల వేతనం పొందుతున్నారని దంపతులు తెలిపారు.

కోతిరాంపూర్‌లో లక్ష్మణ్‌ 2002లో నిర్మించుకున్న ఇంటిని తన కుమారుడు రవికుమార్‌ పేరున గిఫ్ట్‌ డీడ్‌ చేసినట్లు పేర్కొన్నారు. అయితే 2023 నుంచి ఆ ఇంటిని విక్రయిస్తానని, ఖాళీ చేసి వెళ్లిపోవాలని కుమారుడు చెబుతున్నాడని వారు ఆరోపించారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయమే ప్రస్తుతం తమకు ప్రధాన ఆధారమని వృద్ధ దంపతులు తెలిపారు. వృద్ధాప్యంలో తమను ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా భార్య జయలక్ష్మి గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందంటూ.. లక్ష్మణ్ ఆవేదన వ్యక్తంచేశారు.

తమకు ఆధారంగా ఉన్న ఇంటిపై చేసిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసి, వృద్ధాప్యంలో తమకు రక్షణ కల్పించాలని అధికారులను వేడుకున్నారు. కుమారుడితో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరారు.

వీడియో చూడండి..

వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్న కొడుకుతోనే ఆస్తి విషయంలో వివాదం ఏర్పడటంతో.. ఇంటి ముందు బైఠాయించిన వృద్ధ దంపతుల ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరాతీసినట్లు సమాచారం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *