Headlines

భూమి, బొగ్గు, గ్యాస్‌తో పనిలేదు.. సముద్రం నుంచి విద్యుత్తు ఉత్పత్తి..! ప్రపంచపు మొట్టమొదటి..


భూమి, బొగ్గు, గ్యాస్ ద్వారా కాదు… ఇప్పుడు సముద్రం నుంచే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.. అవును.. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. దీనికి పెద్దగా ప్రచారం లభించలేదు. కానీ, ప్రతిఒక్కరూ దీనిపై దృష్టి పెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ఏం జరుగుతుందో ప్రతిఒక్కరూ గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రపంచ శక్తి పోటీ ఎక్కువగా.. ఎవరికి ఎక్కువ శక్తి ఉత్పాదక సామర్థ్యం ఉందనే దానిపై ఆధారపడి ఉంది. ఇరాన్ యుద్ధంలో, మొత్తం ఆట అంతా చమురు వాణిజ్యాన్ని నియంత్రించడం గురించే. కొనసాగుతున్న ఏఐ యుద్ధంలో, ప్రపంచ డేటా సెంటర్లను నియంత్రించడానికి భారీ మొత్తంలో విద్యుత్ అవసరం అవుతుంది. ఈ విషయం అన్ని దేశాలకు తెలుసు. ఈ క్రమంలోనే ప్రపంచపు మొట్టమొదటి శక్తి ద్వీపం పుట్టుకొచ్చింది.

ద్వీపం ఏర్పాటు వెనుక ముఖ్య కారణాలు:

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇంధనం కోసం రష్యాపై ఆధారపడటం ప్రమాదకరమని గ్రహించిన ఐరోపా, సొంతంగా విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. బెల్జియం చాలా చిన్న దేశం కావడంతో భూమిపై వందలాది గాలిమరలను అమర్చడం సాధ్యం కాదు. సముద్రంలో నిరంతరం బలమైన గాలులు వీచడం వల్ల భూమిపై కంటే సముద్రంలోనే పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ సమస్యలకు పరిష్కారంగానే సముద్రం మధ్యలోనే ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మించాలని బెల్జియం నిర్ణయించింది.

అద్భుత ఇంజనీరింగ్ ప్రాజెక్ట్:

బెల్జియం తీరానికి 45 కిలోమీటర్ల దూరంలో, 6 హెక్టార్ల అంటే సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ ద్వీపాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కొక్కటి 22,000 టన్నుల బరువు, ఏడు అంతస్తుల భవనమంత ఎత్తు ఉండే 23 భారీ కాంక్రీట్ పెట్టెలను సముద్రంలో ముంచి, వాటి మధ్య 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను నింపి బలమైన పునాది ఏర్పాటు చేశారు. ఈ ద్వీపం ఒక భారీ విద్యుత్ సేకరణ కేంద్రంగా పనిచేస్తుంది. సముద్రంలో అమర్చే 250కి పైగా టర్బైన్ల నుండి వచ్చే 3.5 గిగావాట్ల హరిత విద్యుత్తును సేకరించి, సబ్‌సీ కేబుళ్ల ద్వారా భూభాగానికి ప్రసారం చేస్తుంది.

ఇవి కూడా చదవండి



ఈ ఒకే ఒక ఐలాండ్ బెల్జియం మొత్తం విద్యుత్ డిమాండ్‌లో మూడింట ఒక వంతును (1/3rd) భర్తీ చేస్తుంది. 2031 నాటికి ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, అంతర్జాతీయ కేబుల్ నెట్‌వర్క్ ద్వారా ఈ ద్వీపాన్ని గ్రేట్ బ్రిటన్ మరియు డెన్మార్క్ దేశాల గ్రిడ్‌లకు అనుసంధానించవచ్చు. దీనివల్ల అవసరమైనప్పుడు ఒకరికొకరు విద్యుత్తును విక్రయించుకునే అవకాశం లభిస్తుంది.

భూమి, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, నిరంతరాయంగా లభించే పవన శక్తిని సద్వినియోగం చేసుకుంటూ బెల్జియం నిర్మిస్తున్న ఈ ఎనర్జీ ఐలాండ్, భవిష్యత్తులో ఉత్తర సముద్రాన్ని యూరప్ ప్రధాన ఇంధన కేంద్రంగా మార్చబోతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *