మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కన్నీళ్లు పెట్టుకున్నారు. గురువారం చీపురుపల్లి కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తల సమక్షంలోనే బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీ మార్పు అంశం సమావేశంలో ప్రస్తావనకు రాగా.. బొత్స ఏడ్చేశారు. ఈ సందర్బంగా మజ్జితో ఉన్న అనుబంధాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకుంటుండగా.. ఈ సమయంలో బొత్స ఉన్నట్టుండి భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో నాయకులు, కార్యకర్తలు ఆయను సముదాయించారు. తన మేనల్లుడు టీడీపీలో చేరడాన్ని బొత్స జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత కుటుంబసభ్యుడు పార్టీని వదిలిపెట్టి వెళ్లడంతో ఇలా కార్యకర్తల సమావేశంలో భాగోద్వేగానికి గురయ్యారు. అయితే బొత్స, మజ్జి శ్రీనివాసరావు మధ్య గత కొంతకాలంగా విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గొడవలు మరింత ముదరడంతో మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడి పసుపు కండువా కప్పుకున్నట్లు చెబుతున్నారు.
టీడీపీలో చేరుముందు విజయనగరం వైసీపీ అధ్యక్షుడిగా మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. అలాగే భీమిలి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా పనిచేస్తున్నారు. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుమార్తె అనుషను జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దించనున్నట్లు బొత్స ప్రకటించారు. అయితే జడ్పీ ఎన్నికల్లో తన కుమార్తె సిరి సహస్రను పోటీలోకి దింపాలని మజ్జి శ్రీను భావిస్తున్నారు. ఈ విషయంలో ఇరువురు మధ్య విబేధాలు తలెత్తాయి. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు చెప్పకుండా బొత్స ప్రకటన చేయడంపై మజ్జి శ్రీను అసంతృప్తికి గురయ్యారు. బొత్స ప్రకటనను వైసీపీ అధినాయకత్వం కూడా స్వాగతించడంతో ఆయన మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో తన కూతురితో కలిసి టీడీపీలో చేరారు. చంద్రబాబు పార్టీ కండువా కప్పి వారిద్దరిని సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. టీడీపీలో శ్రీనుకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయనగరం ఎంపీ లేదా జడ్పీ ఛైర్మన్ టికెట్ తన కుమార్తెకు ఇప్పించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందే శ్రీను టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది నిలిచిపోయింది.
టీడీపీలో చేరిన అనంతరం మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్దికి సహకరించేందుకు చేరినట్లు తెలిపారు. గత రెండేళ్లల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమంలో దూసుకెళ్తుందని, చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంకా చాలామంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.