మూవీ రివ్యూ: మండాడి
నటీనటులు: సూరి, సుహాస్, మహిమ నంబియార్, రవీంద్ర విజయ్, సత్యరాజ్, బాల శరవణన్, మిథున్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్ ఆర్ కథిర్
ఇవి కూడా చదవండి
సంగీతం: జీవి ప్రకాశ్ కుమార్
ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్
నిర్మాతలు: ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్
దర్శకుడు: మదిమారన్ పుగళేంది
కథ:
కళింగపట్నంలో పడవ పందాలు బాగా ఫేమస్. అందులో తోపు ఆటగాళ్లు ముత్తు కాళి (సూరి).. సాట్టా పులి (సుహాస్). అయితే కొన్ని అనివార్య కారణాలతో తనకు ప్రాణమైన ఆటను వదిలేసి హైదరాబాద్‌లో 20 ఏళ్లు ఒంటరిగా బతుకుతుంటాడు కాళి. ఈ 20 ఏళ్ళ సమయంలో కళింగపట్నానికి రాజుగా మారతాడు పులి. అన్నీ ఆయన గుప్పిట్లోనే ఉంటాయి.. పైగా పడవల వ్యాపారం చేస్తుంటాడు. ఊళ్ళో జాతర జరుగుతున్న సమయంలో పులి కొడుకు కిషోర్‌పై ఊరందరి ముందు కత్తితో దాడి చేస్తాడు శీను (రవీంద్ర విజయ్) కొడుకు మారి (మిథున్). దాంతో ఊరు వదిలేసి కాళి దగ్గరికి వెళ్తాడు మారి. మరోవైపు తన కొడుకుపై దాడిచేసిన వాడిని ఎలాగైనా చంపాలని తిరుగుతుంటాడు పులి. దాంతో పారిపోయిన కుర్రాన్ని ఊరికి తీసుకొస్తాడు కాళి. 20 ఏళ్ళ తర్వాత ఊరికి వచ్చి.. తన టీం ఫామ్ చేసి పడవ పందేలకు రెడీ అవుతాడు. అప్పుడేమైంది.. అసలు ప్రాణ స్నేహితులుగా ఉన్న పులి, కాళి ఎందుకు విడిపోయారు.. శత్రువులుగా ఎందుకు మారారు..? వీళ్ల మధ్యలోకి చిలకమ్మ (మహిమ నంబియార్), మునయ్య (సత్యరాజ్) ఎందుకొచ్చారు అనేది అసలు కథ..
కథనం:
ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసామని అందరూ చెప్తుంటారు కదా..? ఈ మాటలు మిగిలిన సినిమాలకేమో కానీ మండాడికి మాత్రం పర్ఫెక్టుగా సెట్ అవుతాయి.. సినిమా చూస్తున్నంత సేపు ఆ విజువల్స్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు ఆడియన్స్. సముద్రం మధ్యలో అంత న్యాచురల్‌గా ఎలా చేసార్రా అన్ని యాక్షన్ సీన్స్ అనిపించక మానదు. ఇందులో కూడా గ్రీన్ మ్యాట్, VFX వాడారు కానీ ఒరిజినల్ మేకింగ్ ఎక్కువగా ఉంది. చూస్తుంటేనే అర్థమైపోతుంది.. సినిమా కోసం చాలా రిస్క్ తీసుకున్నారని.. ఒక్క ముక్కలో చెప్పాలంటే సుహాస్ చెప్పినట్లుగానే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని షూట్ చేసారు. ఎప్పుడూ క్రికెట్, హాకీ చూసిన కళ్లకు పడవ పందాలు కొత్తగా అనిపించాయి. దానికి కావాల్సిన సెటప్ కూడా చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు మదిమారన్ పుగళేంది.. ఫస్టాఫ్ అంతా అసలు కథలోకే వెళ్లలేదు.. కేవలం హీరో విలన్ మధ్య వైరం చూపించాడు. ఏదో ఉంది, ఏదో ఉందనే బిల్డప్ బాగానే క్రియేట్ చేసాడు. ఇంటర్వెల్ నుంచి కథ ఊపందుకుంది.. ఆ సీక్వెన్స్ అంతా అదిరిపోతుంది.
సెకండాఫ్ మెయిన్ స్టోరీ మొదలయ్యాక కాసేపు నెమ్మదిగా వెళ్తుంది.. కానీ సూరీ, సుహాస్ మధ్య కాన్‌ఫ్లిక్ట్ వచ్చాక అసలు కథ ఆగలేదు.. ఒకర్ని మించి ఒకరు పోటీ పడి మరీ నటించారు. ప్రాణ స్నేహితులు శత్రువులుగా మారడం పాత కాన్సెప్టే కానీ దాన్ని స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఇందులో కూడా కొన్ని లోపాలున్నా.. ప్రజెంటేషన్ మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సత్యరాజ్ పాత్ర ఎంట్రీ ఇచ్చాక కథతో మరింత వేగం పెరుగుతుంది. సముద్రం మధ్యలో పడవ పందేలు అనే కాన్సెప్ట్ తీసుకున్నపుడు దాని గురించి పూర్తిగా చెప్పాల్సిందే. అందులో దర్శకుడు పుగళేంది ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో పాటు క్లైమాక్స్ కూడా పూర్తిగా సముద్రంలోనే షూట్ చేసారు. అవన్నీ చాలా న్యాచురల్‌గా తీసారు. క్లైమాక్స్ అయితే చాలా బాగా షూట్ చేసారు. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ తీసేసుంటే ఇంకా రేంజ్ పెరిగేది. ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్లిన ఆడియన్స్‌ను ఈ మండాడి నిరాశ పరచడు.
నటీనటులు:
సూరి గురించి ఏం చెప్పాలి.. ఈయనేనా ఒకప్పుడు కమెడియన్‌గా చేసింది అనిపించక మానదు. మనోడి ట్రాన్స్‌ఫర్మేషన్‌కు, సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అవ్వాల్సిందే.. సుహాస్ సర్‌ప్రైజింగ్ ప్యాకేజ్.. సూరీకి ఏమాత్రం తగ్గలేదు.. పోటీ పడి నటించాడు. మహిమ నంబియార్ హీరోయిన్ కంటే మంచి ఇంపార్టెంట్ రోల్ చేసింది. సత్యరాజ్ ఉన్నంతసేపు అదరగొట్టాడు. రవీంద్ర విజయ్, బాల శరవణన్, మిథున్ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
మండాడి సినిమాకు జీవి ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ప్రాణం… పాటలే కాదు ఆర్ఆర్ అదిరిపోయింది. అలాగే ఎస్ ఆర్ కథిర్ సినిమాటోగ్రఫీ కూడా పీక్స్. విజువల్స్ అన్నీ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త ఫోకస్ చేసుంటే బాగుండేది. దర్శకుడు మదిమారన్ చాలా మంచి కథ రాసుకున్నాడు.. ఇలాంటి కథను స్క్రీన్ మీదకు ఎక్కించాలంటే చాలా కష్టం.. కానీ దాన్ని చాలా వరకు విజయవంతంగా చేసి చూపించాడు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా మండాడి.. ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా..!